హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతా వ్యవస్థను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగంగా ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’(టీజీ-టీఎంఏఆర్ఎస్)ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాఫిక్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్, హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, ఈ-చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ డాటా విశ్లేషణ, ప్రాసిక్యూషన్‌తోపాటు రైలు ప్రయాణ భద్రతనూ ఈ బ్యూరో పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో వేర్వేరుగా కొనసాగుతున్న ట్రాఫిక్ విభాగాలకు రాష్ట్రస్థాయిలో ఒకే రకమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డాటా విశ్లేషణ, సమీక్ష వ్యవస్థను తీసుకురావడమే టీమార్స్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్లకుపైగా రోడ్ నెట్వర్, 1.8 కోట్లకుపైగా వాహనాలు ఉండటంతో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు పెరుగుతున్నాయని ఉత్తర్వుల్లో పేరొన్నది. దీంతో 300 పోలీసు పోస్టులతో టీజీ-టీమార్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది.
టీజీ-టీమార్స్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దీనికి పరిధి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. బ్యూరో పరిపాలనా, క్రమశిక్షణాపరమైన నియంత్రణ డీజీపీకి ఉంటుంది. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి నిర్ణయాలను అమలుచేసే బాధ్యత కూడా బ్యూరోకే ఉంటుంది. ఇది కమిషనర్లు, ఎస్పీలకు ఉన్న రోజువారీ ట్రాఫిక్ ఆపరేషనల్ కంట్రోల్‌గా కొనసాగనున్నది. ఇందులో ప్రధానంగా రెండు జాయింట్ డైరెక్టర్ స్థాయి విభాగాలు ఉంటాయి.
ఈ వ్యవస్థలో కీలకమైనది ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రోడ్క్రాష్ రెస్పాన్స్ ఆఫీసర్‌ను నియమించడం. ట్రాఫిక్‌తోపాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలోని సిబ్బందిలో ఒకరు ఈ బాధ్యత నిర్వహించేందుకు ఎంపిక చేస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరడం, ఆధారాలు భద్రపరచడం, గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను దవాఖానకు తరలించడం తదితర బాధ్యతలు ఉంటాయి. ప్రతి మరణం, గాయాలకు దారితీసిన పరిస్థితులను ‘మల్టీ డిపార్ట్మెంటల్ రోడ్క్రాష్ ఇన్స్పెక్షన్ కమిటీ’ పరిశీలించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లను ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పరికరాలతో అనుసంధానం చేయడంతోపాటు ఎన్హెచ్ఏఐకి చెందిన ఏటీఎంస్ కంట్రోల్ సెంటర్లతోనూ సమన్వయం చేయాలని ఉత్తర్వుల్లో పేరొన్నారు. స్పీడ్ డిటెక్షన్, ఏఎన్పీఆర్, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు, బాడీ-వోర్న్ కెమెరాల వినియోగానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ-చలాన్ కేసులు, ప్రమాదాల డాటా, పెట్రోలింగ్ వివరాలను విశ్లేషించే ‘ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అనలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెల్’ ఉంటుంది.
ప్రత్యేక హైవే పెట్రోల్ యూనిట్లు : హైవేలపై 24 గంటల నిఘా, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఔటర్ రింగ్ రోడ్డు, నోటిఫై చేసిన రాష్ట్ర రహదారులపై ప్రత్యేక హైవే పెట్రోల్ యూనిట్లు పనిచేస్తాయి.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆపరేషన్లు : డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్‌సైడ్ డ్రైవ్, హెల్మెట్ ఉల్లంఘనలు, ఓవర్‌స్పీడ్, లోడింగ్, అనధికార లైట్లు, హూటర్ల వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్లు నిర్వహించే అధికారం బ్యూరోకు ఉంటుంది.
ట్రాఫిక్ కేసుల దర్యాప్తు : ట్రాఫిక్, రోడ్డు ప్రమాద కేసుల ప్రాసిక్యూషన్‌ను కూడా టీజీ-టీమార్స్ పర్యవేక్షిస్తుంది. ఎలక్ట్రానిక్ ఆధారాలను చట్టబద్ధంగా సర్టిఫై చేయడం, కోర్టుల్లో సమర్థవంతంగా ప్రవేశపెట్టడం, అవసరమైన కేసులను లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులకు పంపడం వంటి బాధ్యతలు ఉంటాయి.
రైల్వే భద్రతా దీని పరిధిలోకే : టీజీ-టీమార్స్ పేరు కేవలం రోడ్డు భద్రతకే పరిమితం కాదు. ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణతో పాటు మెట్రో, హైస్పీడ్/బుల్లెట్ ట్రైన్, ఇతర రైలు రవాణా వ్యవస్థల భద్రతపై పోలీసింగ్ బాధ్యతలు కూడా ఇందులో ఉన్నాయి. టీజీ-టీమార్స్కు ప్రత్యేక ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్’ ఏర్పాటుచేయనున్నారు. బ్యూరో హెడ్ క్వార్టర్స్, హైవే పెట్రోల్ యూనిట్లు, ట్రైనింగ్ అకాడమీలో పనిచేసే పోలీసు సిబ్బందికి సాధారణంగా మూడేండ్ల ఉద్యోగకాలం, ప్రత్యేక అనుమతితో ఐదేండ్లు ఉంటుంది.