హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తేతెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్మూ, ధైర్యముంటే మీ ఫ్యామిలీతోపాటు మంత్రి పొంగులేటి కుటుంబం చేస్తున్న భూదందాలపై విచారణకు సిద్ధమేనా?’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ విసిరారు. అప్పుడే మీరు వేసిన అధికారుల కమిటీ విచారణపై ప్రజలకు నమ్మకం ఉంటుందని, లేదంటే దానిని అంతా తొండి కమిటీగా భావిస్తారని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమని కేటీఆర్, హరీశ్‌రావు ప్రకటించారని, అదే జరిగితే అధికార పెద్దల బాగోతాలు ఎక్కడ బయట పడుతాయోననే ప్రతిపక్ష నేతలపై వేధింపుల కమిటీ వేశారని మండిపడ్డారు.
134 జీవో పేరిట ప్రతిపక్ష బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నారని, అధికారుల కమిటీని అడ్డంపెట్టుకొని ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్, పార్టీ నేతలు అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్, మంద శ్యామ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ముసుగులో ప్రతీకార పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో 22-ఏలోని నిషేధిత భూములపై చర్చ తర్వాత విచారణకు జీవో 134 కింద కమిటీ వేశామని ప్రభుత్వం చెప్పడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వం 22-ఏపై ఐఏఎస్ అధికారి దేవసేన నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ ముమ్మాటికీ వేధింపుల కమిటీయేనని ఆర్ఎవ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు. అందులో వివాదాస్పద ఐఏఎస్ సందీప్‌కుమార్ ఝా ఉండటం, ప్రభుత్వ పెద్దల ఆస్తులను వదిలి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వారి కుటుంబీకులు, సంబంధీకుల ఆస్తులపై విచారణ జరిపిస్తామని మార్గదర్శకాల్లో చేర్చడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. చివరకు 2015లో రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన స్టీఫెన్సన్ భూములపైనా విచారణకు ఆదేశించడం చూస్తే ఇందులోని కుట్ర అర్థమవుతుందని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల భుజాలపై తుపాకులు పెట్టి బీఆర్ఎస్ నేతలను కాల్చే భయంకరమైన కుతంత్రానికి తెరలేపారని దుయ్యబట్టారు. ఇందులో కుట్ర లేకుంటే 16 మందికే విచారణను పరిమితం చేయడంలోని ఆంతర్యమేందని ప్రశ్నించారు. అధికారులు సైతం రేవంత్‌రెడ్డి ట్రాప్‌లో పడి భవిష్యత్తులో ఇబ్బందులపాలు కావొద్దని సూచించారు.
అధికారుల కమిటీ విచారణ పరధిలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాలపై అందిన ఫిర్యాదులు, వారు సాగించిన భూదందాలను కూడా చేర్చాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘రూ.8 వేల కోట్ల విలువైన అసైన్మెంట్ భూములను కొట్టేసిన పొంగులేటి కొడుకు హర్షకు సంబంధించిన వ్యవహారం, రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి పసుమాములలో కబ్జా చేసిన భూములు, ఇబ్రహీంపట్నం రాందాస్‌పల్లి భూముల కబ్జాలు, ఖానామెట్, గచ్చిబౌలి డైమండ్ హిల్స్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతల భూ దందాలు, ఫీనిక్స్ నుంచి రాత్రికి రాత్రే డెవలప్మెంట్ హకులు చేజికించుకొన్న పొంగులేటి కొడుకుకు చెందిన రాఘవ డెవలపర్స్‌పై, వట్టినాగులపల్లిలో పొంగులేటి భూదందాలను అధికారుల కమిటీ విచారణ పరిధిలోకి తేవాలని సూచించారు. లేదంటే కమిటీ విశ్వసనీయతను, నిబద్ధతను శంకించాల్సి వస్తుందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి, ఆయన భార్య, బిడ్డ, సోదరులు, అల్లుడికి 460 ఎకరాల భూములున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది తమకు అందిన ప్రాథమిక సమాచారం మాత్రమేనని, ఇంకా ఎన్నికోట్ల విలువైన భూములున్నాయో తెలిసే అవకాశం ఉన్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాక్షసానందానికి దళిత, గిరిజనులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. టెనెన్సీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయల భూములను రేవంత్ కుటుంబం కొల్లగొడుతున్నదని ధ్వజమెత్తారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి కొంపల్లిలో గజానికి కేవలం రూ.11,000 చొప్పున 150 కోట్ల విలువైన భూమిని రూ.8 కోట్లకే ఎలా కొనుగోలు చేశారు? గజానికి రూ.1.50 లక్ష విలువ కలిగిన చోట ఇంత చౌకగా భూమి కొనుగోలు ఏ విధంగా సాధ్యమైంది? ఇది మనీ లాండరింగ్ కాదా?’ అని సూటిగా ప్రశ్నించారు. మెడికవర్స్ హాస్పిటల్స్‌లో రేవంత్‌రెడ్డి అల్లుడు వాటాదారు అయినందునే ఆ దవాఖానలు రాష్ట్రమంతంటా విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ఆయన అల్లుడి హాస్పిటళ్ల ప్రారంభానికి రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లారని, అందులో వాటాలను రూ.1,200 కోట్లకు విక్రయించారని, వీటిలో రేవంత్ అల్లుడు, ఆయన వాటాలపై అధికారుల కమిటీ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేవలం బీఆర్ఎస్ నాయకుడే కాదు.. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన మహానేత’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంటే ప్రజలకు ఒక ఎమోషన్ అని స్పష్టంచేశారు. ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్‌ను పోలిన పాత్రకు వస్తున్న విశేషాదరణ ఆ మహానేతపై తెలంగాణ ప్రజలకున్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పారు. అందుకే కేసీఆర్‌పై ప్రేమతో యువత నిమజ్జనోత్సవాల్లో ఆయన పాటలు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి యువతతో కనెక్ట్ కాకపోవడంతోనే ఆయన పాటలు పెట్టుకోవడంలేదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలు చాటుకుంటున్న అభిమానంపై ఆంక్షలు విధించడం సబబుకాదని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో తన సొంత పాటలు పెట్టుకోవడం చట్టవిరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. సజ్జనార్ వృత్తి బాధ్యతలు నిర్వర్తించాలే తప్ప.. ఇలా తప్పుడు ఆదేశాలివ్వడం సరికాదని హితవుపలికారు. గతంలో తెలంగాణలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు.