బిచ్కుంద/ఏర్గట్ల, డిసెంబర్ 27: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్ సమ్మె నిర్వహించారు. ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించక పోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. సీపీఐ కామారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు సురేశ్ గొండ, జీపీ కార్మికుల సంఘం ప్రతినిధులు రూప్సింగ్, సాయిలు, భూమయ్య, లక్ష్మణ్, గంగవ్వ, చంద్రవ్వ, శకుంతల, మారుతి, సాయిరాం, హన్మాండ్లు, రఫిక్, రాకేశ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.