HomeNizamabadGram Panchayat Workers And Outsourcing Employees Have Not Received Their Salaries Yet
పండుగ పూట పస్తులేనా?
బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బతుకమ్మ, దసరా సమీపస్తున్నా అందని వేతనాలు
ఇబ్బందుల్లో జీపీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఆందోళనలు చేపట్టినా కనికరించని ప్రభుత్వం
బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. పండుగల పూట పస్తుండాల్సిందేనా అని జీపీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
-కామారెడ్డి/ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 26
అందని జీతాలు.. ఇబ్బందుల్లో కార్మికులు
కామారెడ్డి, సెప్టెంబర్ 26 : గ్రామ పంచాయతీ కార్మికులు చాలీ చాలని వేతనాలతో జీవనాన్ని గడుపుతున్నారు. ప్రతినెలా వేతనాలు చెల్లించకపోవడంతో కామారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్మికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో నెలానెలా వేతనాలు చెల్లించేవారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వేతనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం నెలకొన్నదని జీపీ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. బతుకమ్మ, దసరా పండుగలను తాము ఎలా జరుపుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ పండుగలకు పస్తులుండాల్సిందేనా అని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మూడు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో 19,200 మంది జీపీ కార్మికులు
కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా వివిధ రకాల కార్మికులు 19,200 మంది పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కారోబార్, పంపు ఆపరేటర్లు, స్వీపర్లు, సిపాయి, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లు ఇలా ఆరు రకాల మల్టీపర్పస్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. వేతనాలు చెల్లించాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి, సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించనప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
బీపీ కార్మికుల కలెక్టరేట్ ముట్టడి
కంఠేశ్వర్, సెప్టెంబర్ 26: మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీపీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఐడీవోసీ కార్యాలయం లోపల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీపీవో వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి కొండా గంగాధర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులపై వివక్ష చూపెడుతున్నదని మండిపడ్డారు. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకు తారని ప్రశ్నించారు. వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరగంట అనంతరం డీపీవో శ్రీనివాస్ అక్కడికి చేరుకొన్నారు. కార్మికులతోపాటు కలెక్టరేట్ బయట గేటు వరకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. నాయకులు సాగర్, రేఖ, ఆంజనేయులు, సాయిలు, పద్మ, పో శెట్టి, గంగా రాం, లక్ష్మీ, గంగామణి, దీవెన, సునీత తదితరులు పాల్గొన్నారు.
ఐదు నెలలుగా అందని వేతనాలు
ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 26: నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఔవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఐదు నెలలుగా జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు. దసరా, బతుకమ్మ పండుగలు వస్తున్నా జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాల్లో సంతోషం లేకుండా పోయింది. సకాలంలో జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేసిన అప్పులు పేరుకుపోయి ఇబ్బందులు పడుతుంటే దసరా పండుగను ఎలా సంతోషంగా జరుపుకుంటామని వాపోతున్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించినా ప్రభుత్వం ఇసుమంతైనా కనికరించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సెలవులు ఉండవు. అలాంటి వారితో సంక్రాంతి, వినాయకచవితి, దసరా, దీపావళి పండుగలకు కచ్చితంగా హాజరుకావాల్సిందే. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకునే వారే కరువయ్యారు.
పండుగ ఎలా జరుపుకోవాలి?
మూడు నెలల నుంచి మాకు జీతాలు చెల్లించడంలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నం. వేతనాలు చెల్లించకపోతే బతుకమ్మ, దసరా పండుగలను ఎలా జరుపుకోవాలి?. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలి.
-చిట్యాల శ్యామల, కార్మికురాలు, రాజంపేట్
వేతనాలు రాగానే చెల్లిస్తాం…
జిల్లాలోని పంచాయతీ కార్మికులకు వేతనాలు రాగానే త్వరలోనే చెల్లిస్తాం. ప్రతినెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. జీపీ కార్మికులెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు