కొన్నిరోజులుగా రైతులను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ముందస్తుగా వరి పంట సాగుచేసిన రైతులు కోతలు పూర్తయి ఆరబెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిముద్దవుతున్నది. బాన్సువాడ ప్రాంతంలో అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మ్యాచర్ పేరుతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు రైస్ మిల్లర్లు ధర తగ్గించి కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
-బాన్సువాడ, అక్టోబర్ 28
కొన్నిరోజులుగా ధాన్యం ఆరబెట్టుకుంటున్న అన్నదాతలు ఆకాశం మేఘావృతమైతే చాలు ఆందోళన చెందుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కల్లాలతోపాటు రోడ్లపై ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. సాయంత్రం కుప్పలుగా చేసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పుతున్నా రు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే మొలకలు వచ్చే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ టార్పాలిన్లు, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు డ్రయ్యర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యాన్ని కుప్పలు చేసేలోపే కండ్లముందే తడిసి ముద్దవుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకవైపు కేంద్రాల్లో మ్యాచర్ పేరిట కొనుగోళ్లు చేపట్టకపోవడం, మరోవైపు మ్యాచర్ రావడంలేదని వాపోతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేపడుతున్నారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతులను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. ఏకధాటిగా వానలు కురవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని, ధాన్యం తడిసిందని రైస్‌మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి కోతలు కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. తుపాన్ ప్రభావం తగ్గిన తర్వాతే కోతలు చేపట్టాలనే నిర్ణయంతో, ప్రస్తుతం కోతలకు బ్రేక్ వేశారని తెలుస్తోంది.