నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సోయా రైతులకు నష్టాలు రాకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా పంట ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నామని మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోయా పండించిన రైతులకు జరుగుతున్న నష్టంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘పక్క రాష్ర్టాలకు సోయా’, జిల్లా సంచికలో ‘సోయా రైతు దిగాలు’ శీర్షికలతో ప్రచురితమైన వార్తా కథనాలకు మార్క్ఫెడ్ ప్రొక్యూర్మెంట్ ఉన్నతాధికారులు స్పందించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దకొడప్గల్ మండలంలో పెద్దమొత్తంలో సోయా దిగుబడులు వచ్చినప్పటికీ ఇంత వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో పంటను అమ్ముకునేందుకు వేచి చూడలేక మహారాష్ట్రకు పంటను తరలిస్తూ రైతులు తీవ్రంగా నష్టాలు చవి చూస్తున్నది నిజమేనని నిర్ధారించారు. ఈ మేరకు పెద్దకొడప్గల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు మార్క్ఫెడ్ చర్యలు చేపట్టింది. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థ(పీఏసీఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేసిన సోయాకు కనీస మద్దతు ధరతో రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తామని మార్క్ఫెడ్ డీఎం మహేశ్ స్పష్టత ఇచ్చారు. రైతులెవ్వరూ ప్రైవేటు వ్యాపారులకు సోయాను అమ్ముకోవద్దని సూచించారు.
సోయా పంట సేకరణపై కాంగ్రెస్ సర్కారు సీలింగ్ విధించింది. రైతులు ఎంత ఉత్పత్తిని సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం ఎకరానికి కొంత మొత్తాన్నే మార్క్ఫెడ్ ద్వారా సేకరించాలని సర్కారు నిర్ణయించడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ఎకరాకు 12క్వింటాళ్ల నుంచి 14క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్న రైతు నుంచి మొన్నటి వరకు కేవలం ఎకరాకు 6క్వింటాళ్ల చొప్పున మాత్రమే మార్క్ఫెడ్ సేకరించింది. మిగిలిన పంటను తీసుకోకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని రైతులు మోసపోయారు. రూ.వేలల్లో నష్టాలను చవి చూశారు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గళం విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో సోయా రైతుల బాధలను వెలుగులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఈ పరిమితిని ఎకరాకు 6క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచింది. కానీ ఇంత వరకు పాత పద్ధతిలోనే సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది.ఎకరాకు 6క్వింటాళ్లు చొప్పున సోయాను మార్క్ఫెడ్ సేకరిస్తోంది. కొత్త విధానం ప్రకారం ఎకరాకు 10క్వింటాళ్లు కూడా సేకరించకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పూర్తి స్థాయిలో సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.