నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సోయా రైతులు డీలా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాక దిగాలు చెందుతున్నారు. చేసేది లేక ఉమ్మడి జిల్లా రైతులు పంటతో సహా పక్క రాష్ర్టానికి పయనమవుతున్నారు. కొనే వారు దిక్కు లేక, దళారుల చేతిలో మోసపోవడం ఇష్టం లేక వ్యయ ప్రయాసాలకోర్చి సోయాబీన్‌ను మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలో సోయాబీన్ సాగు చేసిన రైతులంతా పంటను మహారాష్ట్ర వ్యాపారులకు అప్పగిస్తున్నారు. మన రైతులకు రేవంత్ ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో సోయా రైతులకు కొండంత అండ ఉండేది. పంటను ఉన్నచోటే అమ్ముకునే పరిస్థితులు ఉండేవి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేటు వర్తకులు మోసం చేస్తుండడంతో చేసేది లేక పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల్లో చాలా మంది మహారాష్ట్రలోని ఉద్గిర్ మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తరలిస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాల్లో సోయా సాగయితే, 18వేలు మెట్రిక్ టన్నుల సోయాబీన్‌ను మాత్రమే సేకరించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. నిజామాబాద్‌లో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 5 వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 7 కేంద్రాల ద్వారా 13 వేల మెట్రిక్ టన్నుల సోయాను సేకరించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. కానీ నెలన్నర రోజుల్లో ఇప్పటిదాకా సేకరించింది 4వేల మెట్రిక్ టన్నులు మాత్రమే.
అధికారిక లెక్కల ప్రకారం నిజామాబాద్‌లో 2,047 మంది రైతుల నుంచి 2,712 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 762 మంది నుంచి 1,326 మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించారు. మొన్నటిదాకా ఎకరాకు 6 క్వింటాళ్లు చొప్పున మాత్రమే కొనుగోలు చేశారు. అయితే రైతుల ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడంతో కండ్లు తెరిచిన ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున సేకరించాలని నిర్ణయించింది. కానీ ఇది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. పైగా టార్గెట్‌లో మార్పులు, చేర్పులు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు పెరగలేదు. సోయా సేకరణలో జోరందుకోలేదు.
జిల్లాలో ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 14క్వింటాళ్ల వరకు సోయా పంట దిగుబడి వస్తున్నది. కానీ ప్రభుత్వం మొత్తం పంటను కొనకుండా కొంతే కొంటామని కొర్రీలు పెట్టింది. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో మొన్నటిదాకా ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. రైతుకు మద్దతుగా బీఆర్ఎస్ గళం విప్పడంతో 10 క్వింటాళ్లు సేకరించేందుకు సర్కారు నిర్ణయించింది. కానీ క్షేత్ర స్థాయిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఎకరాకు 10 క్వింటాళ్లకు పైగానే పండించిన రైతులకు మిగిలిన సోయాను ఏం చేయాలో అర్థం కావడం లేదు.
సగం పంటను ప్రభుత్వానికి, మిగిలిన సోయాను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడం ఇబ్బందిగా మారింది. దళారులకే మొత్తం అమ్ముదామంటే గిట్టుబాట ధర రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు దళారులకు అవకాశంగా మారింది. కేంద్రం నిర్దేశించిన మేరకు సోయాకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4892 కాగా, ప్రైవేట్‌లో అమ్మితే వ్యాపారులు రూ.4300 మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామంటూ గొప్పలు చెప్పింది. గద్దెనెక్కాక సోయాకు బోనస్ మాటెత్తకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. సోయాకు బోనస్ ఇస్తే మద్దతు ధర కలిపి క్వింటాకు రూ.5,392 చొప్పున లభించాల్సి ఉంది. కానీ రేవంత్ సర్కారు మూలంగా రైతు రూ.వెయ్యికి పైగా నష్టపోతున్నాడు.
సోయా కొనుగోలు కేంద్రాలు లేకపోవుడుతోని మస్తు తిప్పలైతుంది. టైంకు కేంద్రాలు తెరువలేదు. దిక్కులేక పంటను ప్రైవేటుల అమ్ముకునుడు అవుతున్నది. ప్రైవేటోళ్లు తక్కువ ధర చెబుతుండ్రు. మునుపు సమయానికి కొనుగోలు కేంద్రాలు తెరిచి సోయాను సేకరించేటోళ్లు. ఇప్పుడెవరు పట్టించుకుంటలేరు.
– వంకాయల ఎల్లప్ప, బేగంపూర్, పెద్దకొడప్గల్ మండలం
నాలుగెకరాల్లో సోయా ఏసిన. 35 క్వింటాళ్ల పంట అచ్చింది. సర్కారోళ్ల లెక్క ప్రకారం అధికారులు 30 క్వింటాళ్లే కొంటామంటున్నారు. అది కూడా పత్తా లేకుండా పోయిండ్రు. ఏం చేయాల్నో సమజైతలేదు. ప్రైవేటోళ్లకు అమ్ముదామంటే ధర తక్కువ చెబుతుండ్రు.
– ఎం.డి.అప్రోజ్, సోయా రైతు, పెద్దకొడప్గల్
ప్రభుత్వ ఆదేశాల మేరకు సోయా పంట సేకరిస్తున్నాం. అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– మహేశ్, మార్క్‌ఫెడ్ ఇన్చార్జి మేనేజర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా