ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వచ్చే నెల 4 నుంచి 9 వరకు
సీహెచ్ కొండూర్లోని లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో ఉత్సవాలు
నీలకంఠేశ్వరాలయంలో పూజలు చేసి, ఆహ్వానపత్రిక అందజేత
ఖలీల్వాడి, మే 28 : రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తమ ఇంటి ఇలవేల్పు అని, ఆలయాన్ని పునర్నిర్మించగా.. విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ పునః ప్రారంభోత్సవాలను వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
తాము ఏ కార్యం చేపట్టినా నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామని అన్నారు. ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో స్వామి వారికి ఆహ్వానపత్రికను అందజేసినట్లు తెలిపారు. అనంతరం నీలకంఠేశ్వర ఆలయ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నీలకంఠేశ్వర ఆలయ అభివృద్ధి కోసం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ నీతూకిరణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.