ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇక నుంచి సరికొత్త యూనిఫాంలలో మెరిసి పోనున్నారు. ఇప్పటివరకు ఉన్న యూనిఫాం డిజైన్లను విద్యాశాఖ మార్చింది. నూతన రంగులు, డిజైన్లతో కూడిన దుస్తులను రూపొందించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
కామారెడ్డి, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. మన ఊరు – మనబడి కార్యక్రమం ద్వారా ఇప్పటికే సర్కారు బడులకు మహర్దశ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెస్తున్నది. యూనిఫారాల రంగులను మార్చకుండా డిజైన్లను ఎంపిక చేసింది. అబ్బాయిలు, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా డిజైన్లను రూపొందించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన కొత్త డిజైన్లను ఎంపిక చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య మేరకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇప్పటికే టెస్కో నుంచి క్లాత్‌ను కొనుగోలు చేసి జిల్లాలకు చేరవేసింది. వాటిని వేసవిలో కుట్టించి జూన్ నాటికి విద్యార్థులకు అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జాబితా సిద్ధం..
కామారెడ్డి జిల్లాలో మెత్తం 1,043 పాఠశాలలకు గాను 767 ప్రాథమిక పాఠశాలలు, 120 యూపీఎస్, 156 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలతోపాటు కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో 96,552 మంది విద్యార్థులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ గుర్తించింది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కేజీబీవీ, ఇతర విద్యాసంస్థలన్నింటిలో చదివే విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. 47,627 మంది బాలురు, 43,685 మంది బాలికలు, కేజీబీవీలో 4,963 మంది బాలికలు ఉన్నట్లు విద్యాశాఖ జాబితా తయారు చేసింది.
హ్యండ్ల్యూమ్ సొసైటీ నుంచి వస్ర్తాలు..
రాష్ట్ర హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ (టిస్కో) నుంచి యూనిఫామ్‌కు సంబంధించి వస్ర్తాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. విద్యార్థులకు అందించే దుస్తుల విషయంలో ఎలాంటి అవకతవకలు, ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ టిస్కో నుంచి బట్టల తాన్లను కొనుగోలు చేసింది. విద్యార్థుల యూనిఫాం విషయంలో మన్నిక గల బట్టలను ఎంపిక చేశారు. తాన్ల లోడ్ టిస్కో నుంచి జిల్లా, మండల కేంద్రాలకు చేరనున్నాయి. విద్యార్థుల యూనిఫాంలు కుట్టే టైలర్లు బట్టల తాన్లను తీసుకొని మెజర్మెంట్ ప్రకారం అందించాలి. విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థుల కొలతలను సిద్ధం చేసింది. ఏ పాఠశాలలో ఎంతమంది బాలురు, ఎంత మంది బాలికలు ఉన్నారనే వివరాలు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులకు, అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి చేరాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన విద్యార్థుల దుస్తుల కోసం ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులు పూర్తిచేశారు. యూనిఫాం సిద్ధం చేసేందుకు జిల్లాస్థాయిలో ఏజెన్సీల ఎంపిక పూర్తయ్యింది.
యూనిఫాంలో మార్పులివే…
ప్రభుత్వ పాఠశాలలు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డ్రెస్సులు వైట్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్. కార్పొరేట్ తరహాలో విద్యార్థుల యూనిఫాంలు కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు తరగతి, వయస్సుల వారీగా ఐదు రకాల డిజైన్లతో బాల,బాలికలకు వేర్వేరుగా ఉండేలా క్లాత్‌ను సరఫరా చేశారు.
ఇండెంట్ సిద్ధం చేశాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్వరలోనే యూనిఫాం అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 96,552 మంది విద్యార్థులకు యూనిఫాం కావాలని ఇండెంట్ సిద్ధం చేశాం. ఈ ఏడాది నుంచి డ్రెస్ డిజైన్లను ప్రభుత్వం మార్చింది.
– రాజు, డీఈవో, కామారెడ్డి