పెద్ద కొడప్గల్ పీహెచ్‌సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్నారు. వైద్యులు, సిబ్బంది లేక రోగులకు కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పేదల వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా .. క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కనిపించడం లేదు. అత్యవసర పరిస్థితిలో వైద్యం కోసం ఇక్కడికి వస్తే వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఎటువెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.
మండలంలో మొత్తం 24 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 10 గ్రామ పంచాయతీలు గిరిజన తండాలు ఉన్నాయి. మండల కేంద్రానికి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబుల్‌గాం, విఠల్వాడి, లింగంపల్లి, విఠల్వాడి తండా, పోచారం, పోచారం తండా, శివాపూర్,చావుని తండా, సముందర్ తండా, పెద్ద దేవీసింగ్ తండా, సీతారాంతండా, కుబ్యానాయక్ తండా తదితర గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం పీహెచ్‌సీకి వస్తారు. కానీ దవాఖానలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అటెండరే ఏవో మాత్రలు ఇవ్వడం, గాయలైన వారికి కట్టు కట్టి పంపిస్తున్నాడు. రాత్రివేళ అత్యవసర పరిస్థితుల్లో దవాఖానకు వస్తే వాచ్‌మన్ తప్ప ఎవరూ ఉండకపోవడం గమనార్హం.
దీంతో ఆర్ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ బాన్సువాడ, నిజామాబాద్‌కు తీసుకెళ్దామకున్నా అప్పటి వరకు ప్రాణాలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. ఇలా చాలా సందర్భాల్లో రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. మండలంలోని రతన్ సింగ్ తండాకు చెందిన లాల్‌సింగ్ అనే వ్యక్తి రాత్రివేళ అత్యవసర పరిస్థితిలో ఓ రోగిని ప్రైవేట్ వాహనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ వాచ్‌మన్ తప్ప డాక్టర్, నర్సులెవరూ అందుబాటులో లేరు. కనీసం పీఎంపీ కూడా లేడు. సాయం కోసం ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో అదేరోజు రాత్రి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి ప్రాణాలు కాపాడారు.
పెద్దకొడప్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జబ్బు చేసింది. కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంలేదు. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుండడంతో రోగులు చేసేదిలేక.. ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నా..మెరుగైన వైద్యం పేదోడికి అందని ద్రాక్షలా మారింది. సౌకర్యాలు సరిగా లేకపోవడం ఒక ఎత్తయితే.. సమయానికి వైద్యం అందించే వైద్యులు,సిబ్బంది లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు.
-పెద్ద కొడప్గల్, ఆగస్టు 11
2014 ఏడాదికి ముందు వెంకటేశ్వర్లు అనే డాక్టర్ పీహెచ్సీలో ఐదేండ్లపాటు పనిచేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యులు దవాఖానకు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. దవాఖానలో 24 గంటలూ వైద్య సేవలందించడానికి ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, సూపర్వైజర్, డాటా ఎంట్రీ అధికారి, అటెండర్, వాచ్‌మన్,ఏఎన్ఎంలు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక ఫార్మాసిస్ట్, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, రాత్రి వాచ్‌మన్ మాత్రమే ఉన్నారు.
దవాఖానలో కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో గర్భిణులు, రోగులు అల్లాడిపోతున్నారు. తాగునీరు కోసం బస్టాండ్‌కు వెళ్లి వాటల్ బాటిళ్లను కొనుగోలు చేసుకుంటున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తంచేశారు. మరుగుదొడ్లలో కూడా నీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం.
పెద్ద కొడప్గల్ పీహెచ్సీలో వైదులు,సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలు ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లలేకపోతున్నారు. ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నాం.
-లాల్‌సింగ్, డ్రైవర్, రతన్ సింగ్ తండా
పెద్ద కొడప్గల్ పీహెచ్సీ గురించి ఎమ్మెల్యే, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. కొత్తగా నాలుగువందల మంది వైద్య సిబ్బంది నియమించనున్నా రు. ఇందులో నుంచి పీహెచ్‌సీకు తప్పకుండా కేటాయిస్తారు
-చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో కామారెడ్డి