నిజామాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో నేటి నుంచి బడిగంట మోగనున్నది. మొన్నటి వరకు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఇక పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువులు అటకెక్కుతున్నాయి. తూతూ మంత్రంగా నడుస్తున్న విద్యాభ్యాసంతో విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతోంది.
దీంతోపాటు వారి బంగారు భవిష్యత్తు చీకటిమయమవుతున్నది. రూ.లక్షలు పెట్టి ప్రైవేటులో చదివించిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతున్నది. ప్రభుత్వ బడుల్లో చేర్పించిన వారికి సైతం అసంతృప్తి తప్పడం లేదు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేసే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల పట్టింపులేని తనం, ప్రభుత్వ బడులపై కలెక్టర్లు, డీఈవో, ఎంఈవోల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.
2024-25 విద్యా సంవత్సరంలో వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ మేరకు ప్రస్ఫుటం చేస్తున్నాయి. పది ఫలితాల్లో 2022-23లో 7వ స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. ఈ సారి 20వ స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకున్నది. నిజామాబాద్ జిల్లా కేవలం 16వ స్థానంతో సరి పెట్టుకున్నది. 2025-26 విద్యా సంవత్సరంలోనైనా శ్రద్ధతో విద్యాశాఖ పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇందుకోసం ఉభయ జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. డీఈవోల పట్టింపులేని తనంతో ఈ దారుణమైన దుస్థితి ఎదురైందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాఠశాలల నిర్వహణపై పర్యవేక్షణ కరువు
నిజామాబాద్ జిల్లాలో 1,074 సర్కారు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో లక్షా 4వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైమరీ తరగతుల్లో 39, 803 మంది, హైస్కూల్లో 64,197 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 1,014 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా 98,256 మంది చదువుకుంటున్నారు. ప్రైమరీ తరగతుల్లో 61,805 మంది, హైస్కూల్లో 36,451 మంది ఉన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యావ్యవస్థలో ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్లు, డీఈవోలు శ్రద్ధ వహించడం అత్యవసరం. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధనలో నాణ్యత కొరవడింది.
ఈ సమస్యకు కారణాలు అనేకం ఉన్నాయి. టీచర్ల నిర్లక్ష్యం, సమయ పాలన లేకపోవడం, అధికారుల నిర్లిప్తత, వనరుల కొరత జోడవుతున్నాయి. కొంతమంది టీచర్లు విధుల పట్ల నిబద్ధత చూపడం లేదు. సమయానికి పాఠశాలకు రాకపోవడం, బోధనలో ఆసక్తి చూపకపోవడం వంటి సమస్య లు సర్వ సాధారణంగా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు సమయానికి హాజరుకాకపోవడం, తరగతులు ఆలస్యంగా ప్రారంభంకావడం విద్యా ప్రమాణాలను దిగజార్చుతున్నాయి.
కలెక్టర్లు, డీఈవోలు పాఠశాలల పనితీరును పర్యవేక్షించడంలో విఫలమవుతున్నారు. మంచి పనితీరు చూపిన వారిని ప్రోత్సహించడం, నిర్లక్ష్యం చూపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను తప్పనిసరి చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఉపాధ్యాయులకు ఈసారి పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను సర్కారు నిర్వహించింది. ఈ నైపుణ్యత పేద విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.
పాఠశాలకు డుమ్మా కొట్టి రాజకీయాలు
కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లకుండా రాజకీయాలు చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. వారానికోసారి స్కూల్ మొఖం చూసి సంతకాలు మూకుమ్మడిగా పెట్టేసి జీతాలు లేపేస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించకుండా సంఘం పేరుతో రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లపై నిఘా పెట్టాల్సిన యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం. విద్యా శాఖ గురించి కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. మిగితా జిల్లాల్లో విద్యా శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కువగా ఉండడం మూలంగానే ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
మండల స్థాయి యూనియన్ లీడర్లతో మొదలు పెడితే జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల పేరిట డుమ్మాలు కొట్టి రియల్ ఎస్టేట్, వడ్డీ, చిట్టీ, ఎల్ఐసీ, ఆరోగ్య బీమా, ఇతరత్రా వ్యాపారాలు చేసుకుంటున్న టీచర్లు అనేకమంది ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు పెట్టుకోవడం, వారికి పూల బొకేలతో బుట్టలో వేసుకుని.. పేద, మధ్య తరగతి వర్గాలకు కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తీరని అన్యాయం చేస్తున్నారు. ఏటా వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా పరిస్థితిలో మార్పు లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలకు మహర్దశ
కామారెడ్డి, జూన్ 11 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను మెరుగుపరిచారు. కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టారు. పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్యను అందించారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. వసతి గృహాల్లో సన్న బియ్యంతో భోజనం, రుచికరమైన ఆహారం, ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు అందించారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు సరఫరా చేశారు.
బడుల్లో సమస్యల తిష్ట
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని స్కూళ్లలో ఇప్పటివరకూ శుభ్రం చేయలేదు. మౌలిక వసతులపై ఆరా తీసిన దాఖలాలు లేవు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ముందస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అలా చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోయి శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు చేపట్టకపోవడంతో అక్కడ ఆటోలను పార్కింగ్ చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని ప్రభుత్వ పాఠశాల లోపల నిర్మించిన వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. అది ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
నెలన్నర నుంచి వేసవి సెలవులు ప్రకటించడంతో పాఠశాలలు మూతబడ్డాయి.గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని పాఠశాలల్లో శుభ్రత పనులు చేపట్టాం. విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
-రాజు, కామారెడ్డి డీఈవో