నిజామాబాద్, ఏప్రిల్ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మక్క రైతు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఏటా బహిరంగ మార్కెట్లో ధర లేక ఆగమాగం కావాల్సి వస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఈ సీజన్లో పరిస్థితులు అనుకూలించాలని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, పెద్దకొడప్గల్, గాంధా రి, ఎల్లారెడ్డి, తాడ్వా యి, లింగంపేట, సదాశివనగర్‌లో ఇప్పుడిప్పుడే మక్క కొట్టి కుప్పలుగా వేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మార్కెట్‌కు మక్కలను తీసుకు వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇంత వరకు ప్రభుత్వంలో మాత్రం చలనం కరువైంది. కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌కు అనుమతులు ఇవ్వలేదు. దీంతో కొనుగోళ్ల కేంద్రాల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మక్కల కొనుగోళ్ల మాటే కరువైంది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తే దిగి వచ్చి కేంద్రాలను తెరుస్తున్నారు. ప్రభుత్వమే సంకల్పించుకుని కొనుగోళ్లకు శ్రీకారం చుట్టకపోవడంతో రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేవి. రైతులకు కనీస మద్ధతు ధరను చెల్లించి మక్కలు సేకరించేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముందు చూపు లేకపోవడంతో మక్క రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధర మేరకు క్వింటా మక్క ధర రూ.2400 ఉంది. కానీ ప్రైవేటు వర్తకు లు కేవలం రూ.1800 నుంచి రూ.2వేలలోపు మాత్రమే రైతులకు చెల్లించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల రైతులతో బేరం ఆడుతున్నారు. కొన్ని చోట్ల బైబ్యాక్ ఒప్పందాల్లో భాగంగా విత్తనాల కోసం మక్కలను కొనుగోలు చేసి ప్రైవేటు విత్తన సంస్థలు తీసుకెళ్తున్నాయి. మిగిలిన వారంతా అందిన కాడికి దోచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మక్క రైతులకు ఈసారి భారీగా పెట్టుబడి వ్యయం పెరిగింది. బహిరంగ మార్కె ట్లో మక్కలు విక్రయిస్తే ఎకరానికి సుమారుగా రూ.10వేలు నష్టం వాటిల్లే దుస్థితి ఉంది. ఇదంతా రైతుపైనే భారం పడుతుండటంతో కోలుకోలేని స్థితికి రైతు చేరుకునే ప్రమాదం ఉంది. కామారెడ్డి జిల్లాలో ఏటా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున మొక్కజొన్న సాగుకు నోచుకుంది. నీటి వసతి తక్కువ ఉన్న వారంతా మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం కామారెడ్డి జిల్లాలోనే 40వేల ఎకరాల్లో మక్క సాగైంది. ఒక ఎకరానికి సాధారణ దిగుబడి 30 క్వింటాళ్లు నుంచి 35 క్వింటాళ్ల వరకు ఉంది. ఈ లెక్క ల కామారెడ్డిలో 14లక్షల క్విం టాళ్లు దిగుబడి రానుం ది. ఇందు లో 30 శా తం వరకు ప్రైవే టు వర్తకుల చేతుల్లోకి వెళ్లనుంది. నిజామాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. 10.50లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దాదాపుగా 63కు పైగా మక్క కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు అయ్యేవి. తద్వార రైతులకు మేలు చేకూరేది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే ఆలోచనకు ఏ అంశంలోనూ ముందడుగు పడటం లేదు. మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాటు యాక్షన్ ప్లాన్ అన్నదే ఉమ్మడి జిల్లాలో సిద్ధం కాలేదు. మార్క్‌ఫెడ్ అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో గందరగోళం చోటు చేసుకుంటోంది. మార్కెట్‌కు మక్క రాక షురూ అవుతోన్న క్రమంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కాస్తా రైతులకు పెను శాపంగా మారుతోంది. మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు అవుతాయా? లేదా? అన్నది అంతు చిక్కడం లేదు. కేసీఆర్ హయాంలో ప్రైవే టు వ్యాపారుల ఆగడాలకు చెక్ పడింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో దళారుల మధ్యవర్తిత్వం విపరీతంగా చెలరేగింది. రైతులు ఆరుగాలం పండించిన పం టపై లాభాలు రాకపోగా దళారులకు మా త్రం రెట్టింపు లాభాలు వచ్చేవి. ప్రతి సీజన్లో లాభాలను ఆర్జించేందుకు కర్షుకులు పడిన శ్రమ ఆవిరయ్యేది. తెలంగాణ సిద్ధించిన తర్వాత బ్రోకర్లు, మధ్యవర్తుల పాత్ర నామరూపాల్లేకుండాల చేసేందుకు కేసీఆర్ నిరంతరం కృషి చేశారు. అందుకు తగ్గ పకడ్భందీ చర్యలు అమలు చేసి రైతులకు విశ్వాసం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్ధతు ధరను చెల్లించి వారిని అన్ని రకాలుగా ఆదుకున్నారు. కానిప్పుడు అలాంటి ఆలోచనే పాలకుల్లో కనిపించకపోవడం విడ్డూరంగా మారింది.
మక్క కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కొనుగోళ్లకు ఆదేశాలు వచ్చిన వెంటనే రైతులు పండించిన మొక్కజొన్న సేకరణ మొదలు పెడతాము. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
– శశిధర్ రెడ్డి, మార్క్‌ఫెడ్ మేనేజర్, కామారెడ్డి జిల్లా