కోటగిరి, జూలై 10: గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. సొంత భవనాలు ఉన్నా పాఠశాలల్లో వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానలకు నిధులు మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్లు భవనాలు నిర్మించినా ఆరోగ్య ఉపకేంద్రం (పల్లె దవాఖాన) ఏడాది దాటిన ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో కొత్తపల్లి పాఠశాల గదిలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు.
కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసినా.. అధికారుల జాప్యంతో ఇంతవరకూ ప్రారంభానికి నోచుకోకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. కోటగిరి మండలంలోని ఎత్తొండ, కొత్తపల్లి గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల కోసం ఒక్కొక్క పల్లె దవాఖాన భవన నిర్మాణానికి రూ.20లక్షల నిధులు కేటాయించారు. కొత్తపల్లిలో పల్లె దవాఖాన భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించలేదు. దీంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి గదిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సరైన వసతులు లేక వైద్యం కోసం కేంద్రానికి వచ్చే రోగులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే నూతన ఆరోగ్య ఉప కేంద్రం భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం పల్లె దవాఖాన గతేడాది నుంచి కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల గదిలో కొనసాగుతున్నది. ఒకే గదిలో అన్ని రకాల మందులు ఉంటాయి. అయితే వర్షం కురిస్తే గదిలోకి నీళ్లు రావడంతో ఇబ్బందిగా మారుతున్నది. ముఖ్యంగా ఇక్కడ మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. కొత్త భవనంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అందులోకి ఇంకా వెళ్లలేదు. అధికారుల ఆదేశాల మేరకు వెళ్తాం.
– రమణి, ఎంఎల్హెచ్పీ కొత్తపల్లి, కోటగిరి మండలం