నిజామాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు మిల్లర్ల ఇష్టారాజ్యం.. నడుమ వరి రైతు చిత్తవుతున్నాడు. సర్కారు వడ్లను సరిగా కొనడం లేదు. మిల్లర్లకు అమ్మితే తరుగు పేరిట దోపిడీకి తెరలేపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతుంటే, మిల్లర్లేమో క్వింటాకు 3 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ పాలనలో పంట పండించడం ఒక ఎత్తయితే, అమ్ముకోవడం మరింత కష్టంగా మారింది. ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ఇప్పటికీ ఊపందుకోలేదు.
కొన్నిచోట్ల గన్నీ బ్యాగులు లేవు. మరికొన్ని చోట్ల అసలు కాంటాలే ప్రారంభం కాలేదు. ఇక, కాంటా వేసిన చోట లారీల లోడింగ్ సమస్య నెలకొంది. రాజకీయ చదరంగంలో మునిగి తేలుతున్న రేవంత్ సర్కారు రైతులను పట్టించుకోవడం మానేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు కొనుగోలు తీరుపై సమీక్షలు చేయడమే లేదు. మండలాల వారీగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు. సర్కారు నిర్లక్ష్యంపై కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. గన్నీ బ్యాగులు లేవని, కాంటాలు వేయడం లేదని ఇటీవల పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. తాజాగా ఎల్లారెడ్డి మండలంలోనూ బైఠాయించారు.
కామారెడ్డిలో రైస్ మిల్లర్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. క్వింటాకు 3 కిలోల చొప్పున తరుగు తీస్తూ దోపిడీకి తెర లేపారు. ఎల్లారెడ్డి మండలం అజమాబాద్ కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహారణ. ఓ వైపు సన్న వడ్లు కొనకపోవడం, మరోవైపు కొనుగోలు చేసిన వడ్లను లోడింగ్, అన్ లోడింగ్‌లో జాప్యం చేయడం వంటి సమస్యలతో రైతులు విసుగు చెందుతున్నారు.
ఒక్కో రైతు నుంచి క్వింటాకు 3 కిలోలు చొప్పున తరుగు తీయడం మూలంగా ఒక లోడ్ లారీకి దాదాపుగా 5 క్వింటాళ్లకు పైగా కడ్తా పేరిట రైస్‌మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా పక్కాగా జరుగుతున్నా అడ్డుకట్ట వేయడంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం విఫలమవుతున్నది. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, మిన్నకుండి పోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంటా వేసే సమయంలోనే గన్నీ సంచి పేరిట రెండున్నర కిలోలు తరుగును దోచేస్తున్నారు. కాంటా వేసిన తర్వాత బస్తాలను తరలించే క్రమంలో మిల్లర్లు ఇష్టానుసారంగా రైతుల కష్టాన్ని లాగేసుకోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి మిల్లర్ల దోపిడీ నుంచి కాపాడాలని కర్షకులు కోరుతున్నారు.
పొతంగల్, నవంబర్ 13: గోనె సంచులు లేక ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కల్లూర్ గ్రామ రైతులు బీర్కూర్-పొతంగల్ ప్రధాన రహదారిపై బుధవారం బైఠాయించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులవుతున్నా ఇంతవరకూ కాంటాలు మొదలు పెట్టలేదని మండిపడ్డారు. సంచులు లేవని, రేపు మాపు అంటూ ఐదు రోజులుగా తిప్పించుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల గ్రామంలో గడ్డివాముకు నిప్పు పెట్టారని, అలాగే ఎక్కడ వడ్ల కుప్పలకు నిప్పుపెడతారేమో అన్న భయంతో కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వెంటనే సంచులు తెప్పించి వెంటనే కాంటాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పొతంగల్ సొసైటీ ఇన్చార్జి కార్యదర్శి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఆ తర్వాత సంచులు తెప్పించి కాంటాలను ప్రారంభించిడంతో అన్నదాతలు శాంతించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సమస్యలే నెలకొన్నాయి. తేమ శాతం మిషన్లు సక్రమంగా పని చేయడం లేదని, టార్పాలిన్ కవర్లు, తాలు పట్టే యంత్రాలు ఉండడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి వారం రోజులకు పైగానే పడుతున్నదని చెబుతున్నారు.
తూకంలో తేడాలు ఉంటున్నాయని, తాలు, తేమ పేరు మీద ఎక్కువ కాంటా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు రూ.1900 నుంచి రూ.2వేల లోపే చెల్లిస్తుండగా, సన్నరకాలకు రూ.2400 నుంచి రూ.2500 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సన్న రకాలను కొనుగోలు చేయక పోవడంతో రైతులు దళారులకు అమ్ముతున్నారు. బాన్సువాడ మండలంలో మొన్నీ మధ్యే రైతులు తేమ శాతం విషయంలో జరుగుతున్న మోసాలపై నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కేంద్రాల నిర్వాహకులను నిలదీయడంతో 17 శాతానికి ధాన్యాన్ని కొలిచి తీసుకున్నారు.