Kotagiri | కోటగిరి, ఆగస్టు 22 : నల్లగొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోటగిరి శ్రీ వేద హై స్కూల్ కరస్పాండెంట్ తేళ్ల అక్షర, ఉపాధ్యాయ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోటగిరి మండల కేంద్రంలో శ్రీవేద హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు ప్ల కార్డులతో ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టి ఉపాధ్యాయులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను హత్య చేయడం బాధాకరమన్నారు.
తల్లిదండ్రులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని అన్నారు. విద్యార్థులను దండించడం వల్ల ఉపాధ్యాయులపై కక్షను పెంచుకొని ఇలాంటి పనులు చేపట్టడం బాధాకరమని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు స్వేచ్ఛని ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ విషయంలో సహకరించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు చట్టం తీసుకో రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో శ్రీ వేద పాఠశాల కరస్పాండెంట్ తేళ్ల అక్షర ఉపాధ్యాయ బృందం సాయి పవన్, సాయినాథ్, నాగరాజు, రాము, రమేష్ ,చంద్రకళ, సంగీత ,పూజ, సుప్రియ, గంగాసాగరి, భీమ్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.