కోటగిరి, మార్చి 27 : సన్నరకం వడ్లకు ప్రభుత్వం ఇచ్చిన బోనస్ డబ్బును రైతుల ముసుగులో కొందరు ప్రజాప్రతినిధులు బొక్కేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. కోటగిరిలో గురువారం కొందరు నాయకులు విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సొసైటీ పరిధిలో జరిగిన ఈ అవినీతిలో రూ.20 లక్షలకు పైగానే కొల్లగొట్టారన్నారు. సొసైటీలో 618 మంది రైతులు ధాన్యం విక్రయించగా, మరికొందరు ప్రైవేట్‌లో అమ్ముకున్నారని చెప్పారు. అయితే, బోనస్ డబ్బుల చెల్లింపులో జరిగిన జాప్యాన్ని కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు.
తమ కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం విక్రయించినట్లు ట్రక్షీట్లు రాసుకుని, మిల్లర్లతో కుమ్మక్కై పెద్దమొత్తంలో బోనస్ డబ్బును స్వాహా చేసినట్లు ఆరోపించారు. అసలు వ్యవసాయమే చేయని వ్యక్తుల ఖాతాల్లోనూ, రైస్‌మిల్ యజమాని అకౌంట్లోనూ బోనస్ డబ్బులు జమ కావడం విచిత్రమని తెలిపారు. కోటగిరి సొసైటీ పరిధిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, అవినీతిపరుల నుంచి డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.