వినాయక్‌నగర్, అక్టోబర్ 6: సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమని, మోసపోయిన వారు వెంటనే గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే వారి డబ్బులను రికవరీ చేయడం సులువుగా ఉంటుందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930 నంబర్‌ను సంప్రదించాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
మార్చి నెల నుంచి సెప్టెంబర్ వరకు నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 33 కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో సైబర్ మోసగాళ్ల చేతిలో బాధితులు రూ.4కోట్ల 92లక్షల 54, 875 కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఇందులో నుంచి రూ.87,29,839 రికవరీ చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ బృందంలో ఏసీపీ వెంకటేశ్వరరావు, సీఐ మహ్మద్ ముఖీత్ పాషా, ఎస్సై ప్రవళిక, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,కానిస్టేబుల్స్ శ్రీరామ్, నరేశ్, నాగభూషణం, ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత,శృతి, రమ్య తదితరులు విధులు నిర్వర్తిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.