లింగంపేట, ఫిబ్రవరి 14: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మించిన గోదాం వృథాగా మారింది. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆధునిక గోదాం.. పశువులకు ఆవాసంగా మారగా.. మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం (2019-20)లో మండలంలోని ఎల్లారం గ్రామ రహదారి పక్కన నాబార్డు ఆర్థిక సాయం రూ.మూడు కోట్లతో ఐదువేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంను నిర్మించారు. వానకాలం, యాసంగిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు గన్నీ బ్యాగులను గోదాంలో నిల్వ ఉంచారు.
గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో గన్నీ బ్యాగులు కాలిబూడిదయ్యాయి. మంటలను ఆర్పివేయడానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చిన సమయంలో అధికారులు షట్టర్లను తొలగించారు. తిరిగి వాటిని బిగించకపోవడంతో గోదాం అప్పటి నుంచి పశువులకు ఆవాసంలా మారింది. సమీప గ్రామాల్లోని కొందరు రైతులు తమ పశువులు, గొర్రెలు, మేకలను రాత్రి పూట గోదాంలో ఉంచడంతో దుర్గంధం వ్యాపిస్తున్నది. కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారికి అతి సమీపంలో గోదాం ఉండడంతో వాహనదారులు మద్యం తాగుతుండగా..అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కాపలా కోసం సెక్యూరిటీ గార్డు కోసం నిర్మించిన గది వృథాగా మారింది. రైతుల సౌలభ్యం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదామును వృథాగా ఉంచుకుండా వినియోగంలోకి తీసుకురావాలని మండలవాసులు కోరుతున్నారు.