కోటగిరి, మార్చి 4: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండలం పొతంగల్ గ్రామంలో 43 డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం, అంతకుముందు తిర్మలాపూర్‌లో 165 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. దేశంలో 70 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 68లక్షల70 వేల మంది రైతులు ఉన్నారని తెలిపారు. 92శాతం మంది రైతులు ఐదెకరాలలోపు ఉన్నావారేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2600 రైతు వేదికలను నిర్మించారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పాం సాగు చేస్తే రైతులకు మంచి లాభా లు వస్తాయన్నారు. రైతులు అప్పుల ఊబి నుం చి బయటపడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరైన నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. ఇక్కడి సంక్షేమ పథకాల అమలును చూసి మన పక్క రాష్ర్టాల ప్రజలు వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నదని అన్నారు. తమ ప్రాంతాలను తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, పొతంగల్ సర్పంచ్ వర్ని శంకర్, ఎంపీపీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్‌పటేల్, విండో చైర్మన్ శాంతేశ్వర్‌పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, పార్టీ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, హౌసింగ్ ఏఈ నాగేశ్వర్, మండల నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.