ఆర్మూర్టౌన్, సెప్టెంబర్ 30: జిల్లా పర్యటనకు వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతు ఐక్యకార్యాచరణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆర్మూర్లో నిర్మించిన ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ భవనాన్ని ప్రారంభించేందుకు జూపల్లి సోమవారం వచ్చారు.
ఈ నేపథ్యంలో ఆయనను కలిసి వినతిపత్రం ఇవ్వాలని రైతు జేఏసీ ప్రతినిధులు వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు వాగ్వాదం జరిగింది. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ సర్కారులో.. రైతు సమస్యలపై మంత్రిని కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడమేమిటని కమిటీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు ఐదుగురిని మాత్రమే అనుమతించగా, వారు వెళ్లి మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలని కోరుతూ విన్నవించారు.
మంత్రిని కలిసిన అనంతరం కమిటీ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డు నిబంధన తొలగించి రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతు భరోసా కింద రూ.7,500 చొప్పున వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేనిపక్షంలో రైతులందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కమిటీ సభ్యులు ఇట్టెడి లింగారెడ్డి, దేగాం యాదగౌడ్, మంథని భూమారెడ్డి, సుక్కి సుధాకర్, మోతె చిన్నారెడ్డి హెచ్చరించారు.