ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 16: కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు వార్తా పత్రికల్లో చూశానని, ఇది మంచి నిర్ణయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి స్వాగతించారు. కొడంగల్ మాదిరిగా ఆర్మూర్ నియోజకవర్గంలోనూ మోడల్ గురుకులాన్ని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్మూర్‌లో కొన్ని పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయన్నారు. పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ దవాఖానలో సరిపడా వైద్యులు, సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తేవాలని వైద్యశాఖ మంత్రిని కోరారు. నియోజకవర్గంలో లక్కంపల్లి సెజ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిక్లి, గుంజిలి, కంఠం గ్రామాల లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కావడంతో ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కక్ష సాధింపు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.