వేల్పూర్, జూన్ 5: పంటల సాగులో రైతులకు కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మొన్నటివరకు ఒకవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యంతో నష్టాల బారిన పడగా..మరోవైపు పంటలకు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయించడంలో అధికారులు జాప్యం చేయడంతో కొందరు రైతులు జనరేటర్ సాయంతో పంటలకు నీరందిస్తున్నారు.
మండలంలోని మోతె గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గత నెల 25న కాలిపోయింది. దీంతో రైతులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇవ్వగా, ఐదురోజులు తర్వాత (31వ తేదీ) మరమ్మతుల కోసం తీసుకెళ్లారు.
ఇంతవరకూ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టకపోవడంతో చేసేదేమీలేక రైతులు సొంతంగా జనరేటర్ ఏర్పాటు చేసుకొని పంటలకు సాగునీరందిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ నుంచి 22 వ్యవసాయ బోర్లకు కనెక్షన్ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో తమ పంటలు ఎక్కడ ఎండిపోతాయోనని జనరేటర్ అద్దెకు తెచ్చుకొని పంటలను సాగు చేసుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారుల్లో చలనం కరువైంది.
ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ యశ్వంత్‌ను వివరణ కోరగా.. తనకు ఈ విషయం రెండు రోజుల క్రితం తెలియడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పలువురు రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంటలు తడిసిపోయి మొలకలు వచ్చినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.