ఖలీల్‌వాడి/ కామారెడ్డి, జూలై 9: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాల ని, కార్పొరేట్ అనుకూల విధానాలను మానుకోవాలని కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నా రు. రెండు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు.
కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిజామాబాద్‌లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ చేపట్టారు.
జిల్లా సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నిర్వహించిన సభకు ఐద్వా ఆధ్వర్యంలో భారీగా మహిళలు తరలి వచ్చారు. ఇక, బోధన్, ఆర్మూర్ డివిజన్లలోని అన్ని మండలాల్లోనూ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. అనంతరం అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పలుచోట్ల అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్ విధులు బహిష్కరించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లాలోనూ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్ మీదుగా పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణం ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.