ఖలీల్‌వాడి, జూలై 28: విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ఓపీ సంఖ్య 1700లకు పైగా నమోదవుతున్నవున్నట్లు తెలిసింది. ఇక, జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ దవాఖానలకు రోగుల తాకిడి పెరిగింది. వాతావరణ మార్పులతో పాటు నీటి నిల్వ కారణంగా దోమలు పెరిగి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా దవాఖానలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డు ఏర్పాటు చేయగా, రోగులతో కిటకిటలాడుతున్నది.
మరోవైపు, ప్రస్తుత పరిస్థితులను ప్రైవేట్ దవాఖానలు సొమ్ము చేసుకుంటున్నాయి. విచ్చలవిడిగా బిల్లులు వేస్తూ దండుకుంటున్నాయి. మరోవైపు, ప్రభుత్వ దవాఖానల్లోనే అంటే జీజీహెచ్‌లో చేయాల్సిన డెంగీ పరీక్ష (ఎలిసా టెస్ట్)లను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌లో చేస్తున్నారు. సాధారణ జ్వరాలను సైతం డెంగీ పేరు చెప్పి, ప్లేట్లెట్స్ పడిపోయాయని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బిల్లులు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కాలేజీలో పని చేసే కొందరు వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. జీజీహెచ్‌లో అన్ని వసతులు ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు.. బాధితులను తమ సొంత దవాఖానకు తరలించి వారి నుంచి దండుకుంటున్నారు.
అన్ని పీహెచ్‌సీల్లో మందులు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఈ సీజన్లో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులను సమన్వయం చేస్తూ పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– తుకారాం రాథోడ్, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
దవాఖానలో ఫీవర్ వార్డు ఏర్పాటు చేశాం. అన్ని వసతులు కల్పించాం. ఓపీ ఎక్కువగా ఉండడంతో దవాఖానలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్