నిజామాబాద్, అక్టోబర్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడాది కాలం లో పదుల సంఖ్యలో ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థాన్ని ఎక్సైజ్, పోలీసులు వేర్వేరుగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనే కం వెలుగు చూశాయి. ఈ మత్తు పదార్థం సరఫరా చేసే ముఠాలతో సంబంధం కలిగిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ దీని వెనుక సూత్రధారులను, ముఠా నాయకులను ఛేదించడంలో ఎక్సైజ్, పోలీసులు విఫలం అవుతున్నారు. లింకులను కూపీ లాగితే అసలు దొంగలు పట్టుబడే వీలుంది. కానీ అదేమీ చేయకుండా తూతూ మంత్రం గా కేసులు పెట్టి వదిలేస్తున్నారన్న ఆరోపణలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా తిరిగి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆల్ఫ్రాజోలం విచ్చలవిడిగా రవాణా అవుతోంది. గుట్టుగా రాత్రి, పగలు తేడా లేకుండానే కల్లు తయారీ కేంద్రాలకు చేరుతోంది. కల్లు డిపోలకు ఆల్ఫాజోలం ఎలా వస్తుందనే విషయంపై ఎవ్వరూ దృష్టి సారించకపోవడానికి కారణం ఏమిటి? అన్నది తేలడం లేదు. ఓ వైపు కల్తీ కల్లును అరికడతాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భారీ ప్రకటనలు చేస్తున్నారు. కల్తీ కల్లు ఘటనలు వెలుగు చూసినప్పుడల్లా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెబుతున్నారు. తీరా సీన్ కట్ చేస్తే యథావిధిగా అక్రమార్కుల చేతుల్లోకి ఆల్ఫ్రాజోలం చేరుతూనే ఉంది. కల్తీ కల్లు రాజ్యమేలుతూనే ఉంది.
కల్తీ కల్లుతో సామాన్యుల బతుకులు తలకిందులవుతోన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. కొన్ని నెలల క్రితమే కామారెడ్డి జిల్లాలో వరుసగా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కిలో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లుతో ప్రజలు ఆసుపత్రి పాలవుతోన్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. ఆ ఘటన జరిగిన సమయంలో ఇన్చార్జి మంత్రిగా స్వయంగా ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తూతూ మంత్రంగా ఆబ్కారీ శాఖ తనిఖీలు చేస్తుండడంతో కల్తీ కల్లును నిరోధించడంలో విఫలం అవుతున్నారు.
అక్రమార్కులతో కొంత మంది ఎక్సైజ్ శాఖలోని సిబ్బంది కుమ్మక్కు కావడం, కల్లు తయారీలో నిషేధిత పదార్థాలను వినియోగిస్తున్నారని తెలిసినా పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. కల్తీ కల్లుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. అధికారికంగా నిర్వహించే కల్లు బట్టీలకు రెట్టింపు స్థాయిలో కల్లు దుకాణాలు రాజ్యమేలుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. కానీ ఆబ్కారీ శాఖ మాత్రం కళ్లు మూసుకుని ఉండి పోతోంది. కామారెడ్డి ఘటనతో నిజామాబాద్‌లో ఆబ్కారీ శాఖ తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నది. తిరిగి ఆల్ఫ్రా జోలం నియంత్రణపై కనీసం కన్నెత్తి చూడడం లేదు. అసలు కల్తీ కల్లు వాసనే లేదన్నట్లుగా అధికారుల తీరు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.