భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లాలో మంగళవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రియ వైభవంగా సాగింది. డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లతో పాటు నృత్యాలతో యువత హోరెత్తించారు. వినాయక శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నమస్తే తెలంగాణ, యంత్రాంగం, సెస్టెంబర్17: జై గణేశా… జైజై గణేశా నామస్మరణతో జిల్లా మార్మోగింది. నవరాత్రుల సందర్భంగా మండపాల్లో కోలువైన గణనాథుడి విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు లంబోదరుడిని కీర్తిస్తూ భజనలు, నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో స్వామివారి విగ్రహాలను ఊరేగించి స్థానిక చెరువులు, వాగులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలో ఇందూరు సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో దుబ్బ చౌరస్తాలో మండలి అధ్యక్షుడు బంటు గణేశ్ జెండా ఊపి ప్రత్యేక పూజలు చేసి గణేశ్ శోభాయాత్రను ప్రారంభించారు. రథాన్ని 15ఎడ్ల జతలతో పాటు భక్తులు లాగారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్ర మార్గంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పులిహోర, వెజ్ బిర్యాని, శనగలు, ఉప్మా, తాగునీరు, అరటిపండ్లు వితరణ చేశారు.
బోధన్‌లోని శివాలయంలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు. సార్వజనిక్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి, శోభాయాత్ర ప్రధాన రథానికి ఆయన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, సార్వజనిక్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి పూజలు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చిన్న గణపతులను, రుద్రూర్ రోడ్డులో ఉన్న పసుపువాగులో పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. బోధన్ సార్వజనిక్ గణేశ్ ఉత్సవ కమిటీ వినాయకుడి లడ్డూను వేలంవేయగా బోధన్ మండలం ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన చిన్నోల్ల సాయారెడ్డి రూ. 1.40 లక్షలకు దక్కించుకున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి లడ్డూను అందించి అభినందించారు. నవీపేట మండలంలోని యంచ గోదావరి నదిపై నిమజ్జనం కోసం జిల్లా అధికార యంత్రంగా క్రేన్లను ఏర్పాటు చేసింది. అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌తోపాటు, నిర్మల్ జిల్లా అధికాలు పర్యవేక్షిస్తున్నారు. బ్రిడ్జిపై బుధవారం సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెంజల్ మండలంలోని రెంజల్, సాటాపూర్, దూపల్లి, వీరన్నగుట్ట తదితర గ్రామాల్లో గణనాథులను నిమజ్జనం చేశారు. నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గోదావరి నదిలో భారీ గణనాథులను నిమజ్జనం చేశారు.