నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రియ వైభవంగాసాగింది. ‘గణపతి బప్పా మోరియా.. అగిలే బరస్ తు జల్దీ ఆ’ నినాదాలతో పుర వీధులు మార్మోగాయి. నిజామాబాద్ నగరంలో కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డిలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ తదితరులు శోభాయాత్రలో పాల్గొన్నారు. వర్షం కొంత ఆటంకం కలిగించినప్పటికీ, శోభాయాత్ర కొనసాగింది. డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లు హోరెత్తాయి. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. సీపీ నాగరాజు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణేశ్ నిమజ్జనపర్వాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఊరూ..వాడా గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తాయి. వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా యువతీ, యువకులు కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన చిన్నపాటి విగ్రహాలను వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావిలో నిమజ్జనం చేయగా, మిగతా వాటిని బాసరకు తరలించారు. కామారెడ్డి పట్టణానికి సంబంధించిన గణపతులను సమీపంలోని టేక్రియాల్ చెరువులో నిమజ్జనం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేశారు.
ఉమ్మడి జిల్లాలోని వినాయక లడ్డూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొనడంతో లడ్డూ ధర రూ.లక్షల్లో పలికింది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న గణపయ్య శుక్రవారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ నేపథ్యంలో వివిధ మండపాల వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిట్లం మండల కేంద్రంలోని ముకుంద్‌రెడ్డి కాలనీ గణేశ్ మండలి లడ్డూ ధర రూ.1.55 లక్షలు, నిజామాబాద్ బైపాస్ రోడ్‌లోని వెలమ సంఘం గణేశ్ మండలి లడ్డూ రూ.1,43,111, పిట్లం వైశ్య భవనంలోని గణేశ్ మండలి లడ్డూ ధర రూ.1.08 లక్షలు పలికింది.