ఖలీల్వాడి, జూన్ 10: క్షయ చాపకింద నీరులా చేరి ప్రాణాలను హరిస్తున్నది. టీబీ రోగులకు ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడి శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా వ్యాధినిరోధక శక్తి సైతం తగ్గుతుండడంతో ప్రభుత్వం టీబీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన మందుగోళీలతోపాటు పౌష్టికాహారం తీసుకునేందుకు నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నది. గత ఏడు నెలలుగా పౌష్టికాహారం నిధులు జమకాకపోవడంతో రోగులు కలత చెందుతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం కొంతమంది టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. మిగతా వారిని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. దీంతో బిక్కుబిక్కుమంటూ రోగులు జీవనం కొనసాగిస్తున్నారు. మరికొంత మందికి వైద్యాధికారులే వారి జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారు. మందులు వాడుతున్న తరణంలో పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నగదు జమ ఇలా..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1080మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారికి ప్రతి నెల మల్టీ డ్రగ్ రెసిస్టెన్సీ కోసం రూ.500లు వారి అకౌంట్లో జమ కావాల్సి ఉన్నది. మూడు రకాలుగా అందించే ఈ పథకంలో మొదటగా 0 నుంచి 84 రోజుల వ్యవధిలో రూ.1500, 85 రోజుల నుంచి 168 రోజుల వ్యవధిలో రెండోసారి రూ.1500లు జమచేసి, 169 రోజుల నుంచి మూడో విడుత రోగం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వారివారి అకౌంట్లో ప్రతి నెలా రూ.500 చొప్పున నగదు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పౌష్టికాహార నగదును అందిస్తూ వస్తున్నది. గత ఏడు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకపోవడంతో రోగుల ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి రోగుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు..
జిల్లాలో ఉన్న టీబీ వ్యాధిగ్రస్తులకు గత ఏడు నెలలుగా నిధులు రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు విడుదల కాకపోవడంతో ఆలస్యం జరిగింది. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన వెంటనే వారి ఖాతా లో జమ అవుతాయి. ప్రస్తుతం వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది చూసుకుంటున్నారు.
– తుకారాం రాథోడ్, డీఎంహెచ్వో, నిజామాబాద్