నిజామాబాద్, మే 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోంది. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు వంటివేవి వాళ్లకు పట్టడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో తోడుగా తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖ సైతం అదే తీరులో పయనం అవుతోంది. ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పాలకుల ఆదేశాలతో వక్రమార్గంలో పని తీరు కొనసాగుతోంది. ఉపాధి కల్పనలో భాగంగా మహిళలకు కుట్టు మిషిన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది.
వీటి పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా విడ్డూరకరమైన విషయం వెలుగు చూసింది. నియోజకవర్గాలకు తరలించాల్సిన కుట్టు మిషిన్లను కాంగ్రెస్ నియోజకవర్గ నేతల ఆదేశాలతో సర్దుబాటు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్టాక్ పాయింట్‌ను నిర్ణయించారు. బోధన్, నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కుట్టు మిషిన్లను పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్‌లో వింత పరిస్థితి దాపురించింది. నిజామాబాద్ అర్బన్‌లో క్యాంప్ కార్యాలయం కాకుండా ఓ కాంగ్రెస్ నేత ఆదేశంలో ఎన్ఎసి(న్యాక్) బిల్డింగ్‌కు తరలించారు. ఆర్మూర్లోనూ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా లోకల్ లీడర్లు చెప్పిన ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాకు పంపించారు.
బాల్కొండ నియోజకవర్గంలో మరింత విడ్డూరంగా మారింది. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్‌లో కనీసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాల్లో కుట్టు మిషిన్లకు స్టాక్ పాయింట్‌ను నిర్ణయించారు. కానీ ఇక్కడ మాత్రం ఓ కాంగ్రెస్ నేత ఇంటినే స్టాక్ పాయింట్‌గా చూయించారు. నిత్యం పొద్దున లేచిన దగ్గరి నుంచి పొద్దు పోయే దాకా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నోట నీతి సూక్తులు వస్తుంటాయి.
మాటలేమో కోటలు దాటేలా ఉంటుండగా చేతలు మాత్రం వక్రమార్గాన్ని అనుసరిస్తున్నాయి. కుట్టు మిషిన్ల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరగాలి. కానీ అనధికారిక వ్యక్తులు, కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే చేపట్టేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండటం విడ్డూరంగా మారింది. బాల్కొండ మరింత ఘోరంగా పరిస్థితి దాపురించింది. ప్రజానిలయం పేరుతో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న నేత ఇంటిని స్టాక్ పాయింట్‌గా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. సదరు నేత ఇంటిలో 151 కుట్టు మిషిన్లు ఉన్నాయి. ఎలాంటి ప్రొటోకాల్ లేదు. ఎన్నికల్లో జనాలే ఓడగొట్టారు. అయినప్పటికీ అధికార దర్పాన్ని వక్రమార్గంలో అనుభవించేందుకు పావులు కదుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
గతంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో తహశీల్దార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా అనధికారిక వ్యక్తులతో చెక్కుల పంపిణీ తలపెట్టారు. ప్రజలు తిరష్కరించిన వ్యక్తులకు అందలం ఎక్కించి సపర్యాలు చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్లు, చోటామోటా పదవుల్లో కొనసాగుతున్న నేతలతో ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందించారు. వాస్తవానికి ఇదంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరగాలి. అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కి నిబంధనలకు వ్యతిరేకంగా చెక్కుల పంపిణీ జరిగింది.
ఈ విషయంపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత ఏడాదిలో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎమ్మెల్యే ఆదేశాలతో… ఎమ్మెల్యే చేతుల మీదుగానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే ప్రాధాన్యతను హైకోర్టు గుర్తించింది. అచ్చంగా అలాంటి న్యాయపరమైన రక్షణలు, అనుకూలతలు కుట్టు మిషిన్ల పంపిణీకి వర్తిస్తాయి. కానీ వీటిని అధికార యంత్రాంగం పట్టించుకోకుండా బడా నేతల మాటలకే విలువనిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.