మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ తాము ఉపాధి కోల్పోతున్నామని ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లు శుక్రవారం నిరసనలు చేపట్టారు.
బాల్కొండ, డిసెంబర్ 15 : మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆటో యూనియన్ సభ్యులు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల స్కూల్ గ్రౌండ్లో శుక్రవారం ఆటోలతో తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ స్కీం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీలు తగ్గాయని అన్నారు. తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఆర్మూర్‌టౌన్, డిసెంబర్15: పట్టణంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర ఆటో ప్యాసింజర్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మహిళలకు ప్రభుత్వం ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదని వారు అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఆర్డీవో వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ధర్పల్లి,డిసెంబర్15:మండల కేంద్రంలో ఆటోవాలాలు నిరసన తెలిపారు. మహాలక్ష్మీ పథకంతో ఆటో నడుపుకొని బతికే తాము రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు లబ్ధి చేకూరుతుందనుకున్నాము. కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. మహిళా ప్రయాణికులు ఆటోలు ఎక్కడం లేదు. గిరాకీలు తగ్గాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం ఆటోడ్రైవర్లను ఆదుకోవాలి.
మేము బాల్కొండ నుంచి ఆర్మూర్, నిర్మల్, పోచంపాడ్ తదితర ప్రాంతాలకు రోజూ ఆటోలు నడుపుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆటో నడుపుతూ నేను రోజుకు రూ.300 సంపాదించే వాడిని. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి ఆటోల్లో మహిళలు ఎక్కడం లేదు.