మోర్తాడ్, జనవరి 28: తాము అధికారంలో లేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని, అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం కష్టమవుతున్న తరుణంలో అప్పటి రాజ్యసభ సభ్యుడు, స్నేహితుడు సంతోష్‌కుమార్‌ను అడగగానే వేల్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు.
వేల్పూర్ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం రూ.30లక్షలతో ఇండోర్‌స్టేడియం, రూ.కోటీ 20లక్షలతో ప్రైమరీస్కూల్ బిల్డింగ్, రూ.25లక్షలతో ఉన్నతపాఠశాల బిల్డింగ్, రూ.5లక్షలతో చర్చి కాంపౌండ్, రూ.20లక్షలతో ముదిరాజ్ సంఘ భవనం, రూ.2లక్షలతో ముస్లిమ్ అంజుమాన్ కమిటీ టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.