నిజాంసాగర్/ మద్నూర్, జూలై 28: రైతులు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామం, మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేటు వద్ద విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమైక్యపాలనలో రైతులు కరెంట్ కోసం రోడ్లపైకి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. పంటలు కళ్లముందే ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకపోయాడన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు. ఏ ఒక్క ఎకరం ఎండిపోకుండా పంట రైతుల చేతికి వచ్చేంత వరకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత లోవోల్టేజీ సమస్యలేకుండా అవసరం మేరకు సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో మరో నాలుగు సబ్స్టేషన్లు మంజూరైనట్లు చెప్పారు. నిజాంసాగర్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ నాలుగు మండలాల్లో త్వరలో నూతన సబ్స్టేషన్లు పూర్తికానున్నాయని అన్నారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గేటు వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణంతో ఐదు గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. అనంతరం మండల నాయకులు, అధికారులతో మాట్లాడారు. వర్షాలతో రహదారులు, చెక్‌డ్యాంలు, పంటలు, నివాసపు గృహాలు ఏమైనా దెబ్బతిన్నాయా.. పరిస్థితి ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. వజ్రఖండి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ఈ రమేశ్‌బాబు, ఎంపీపీ యశోద, నాయకులు నీలూ పటేల్, మాధవ్‌రావ్ దేశాయ్, బొల్లి గంగాధర్, శివానంద్, భానుగౌడ్,పెద్ద ఎక్లారా గేటు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రాంపటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, విండో చైర్మన్ శ్రీనూ పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు దరాస్ సురేశ్, సర్పంచ్ హరికా, సింగిల్‌విండో మాజీ చైర్మన్లు పాకల విజయ్‌కుమార్, పండిత్రావు పటేల్, ఎంపీటీసీ లక్ష్మీబాయి, ఏఈఈ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.