గాంధారి, సెప్టెంబర్ 30 : అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ అమలు చేయాల్సిందేనని అఖిలపక్ష నేతలు, రైతులు డిమాండ్ చేశారు. ప్రధానంగా రూ.2లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధారిలో సోమవారం అఖిలపక్ష నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రజలను మోసగించిందన్నారు.
అక్టోబర్ 10 లోపు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అసెంబ్లీతో పాటు సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సగం మందికి రైతులకు రుణమాఫీ కాలేదని, ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందలేదన్నారు. రైతు కూలీలకు రూ.12వేలు, మహిళలకు రూ.4వేల పింఛన్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వకుండా మోసగించారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా, హైడ్రా పేరుతో హైడ్రామాలు ఆడుతున్నారన్నారు.
హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో నిరుపేదల ఇండ్లను కూలగొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. చెరువులో ఉన్న తన అన్న తిరుపతిరెడ్డి ఇంటిని కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులు జరుగడం లేదని, తన హయాంలో బుగ్గరామన్న ఆలయ సమీపంలో రూ.14 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను చేపడితే, ప్రస్తుతం దానిపై డాంబర్ కూడా వేయలేదని విమర్శించారు. దాదాపు రెండు గంటలకు పైగా నిర్వహించిన ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి పోయాయి. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో అఖిలపక్ష నాయకులు పొతంగల్ కిషన్‌రావు, మోజీరాంనాయక్, శివాజీరావు, సత్యంరావు, పెద్దబూరీ సత్యం, సాయిబాబ, మధుసూదన్‌రావు, రెడ్డిరాజు, సయ్యద్ ముస్తాఫా, ముచ్చర్ల శ్రీకాంత్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.