బోధన్ రూరల్/ధర్పల్లి/సిరికొండ/సారంగాపూర్, ఏప్రిల్ 5: ఉమ్మడి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు జిల్లాలోని సాలూరా, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, సిరికొండ, కామారెడ్డి జిల్లా బీర్కూర్ తదితర మండలాల్లో వరి, మక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కూరగాయలు దెబ్బతినగా, మామిడి కాయలు రాలిపోయాయి.
సాలూరా మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న, ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడ్గు, దమ్మన్నపేట్, గోవింద్‌పల్లి, కేశారం, ధర్పల్లి, బెలియతండా, సిరికొండ మండలంలోని తాటిపల్లి, పెద్దవాల్గోట్, పందిమడుగు, కొండూర్, చీమన్పల్లీ, జినిగ్యాల తదితర గ్రామాల్లో పంటలు దెబ్బతిని రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట కండ్ల ముందే రాలిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ఇందల్వాయి రోడ్డు, దమ్మన్నపేట్ రోడ్డులో అడ్డంగా చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నువ్వుల పంట సైతం నేలకొరిగింది. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. సాలూరా మండలంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆదివారం పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని మాధవనగర్‌లో రామసాని కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యు త్‌షా క్తో మృత్యువాత పడ్డాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులకు ఓ చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడింది. దీంతో స్తంభం విరిగి విద్యుత్ తీగలు తెగి ఇంటి వద్ద కట్టేసి ఉంచిన ఐదు గేదెలపై పడడంతో అవి అక్కడికక్కడే మృతిచెందాయి.