ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిక్కుమాలిన పాలన వల్ల ఇటు షాపుల్లోనూ, అటు యాపులోనూ యూరియా దొరకని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
ఫర్టిలైజర్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని, ఓటీపీ నంబర్ పేరుతో సర్కారు రైతులను చీటింగ్ చేస్తున్నదని ఆరోపించారు. యూరియా కోసం అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. నందిపేట్ మండలంలో ఫర్టిలైజర్ యాప్ మోసాలపై మండిపడుతూ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు.
యూరియా కోసం పడుతున్న బాధలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని రైతులు కంటతడి పెడుతున్న దృశ్యాలు చూసి గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చదువు రాదని, ఓటీపీ అంటే ఏమిటో తెలవదని, ఫోన్లో యూరియా బుక్ చేయడం వస్తలేదని, ఇక తమకు యూరియా దొరికేదెట్లా అని రైతులు వాపోతున్నారన్నారు. చదువు రాని, ఫోన్లు వాడడం రాని రైతులకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ శాపంగా మారిందని తెలిపారు.
యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఉండడం తాము చేసుకున్న దౌర్భాగ్యం అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. యూరియా యాప్‌ను తీసేయాలని, గతంలో ఇచ్చిన విధంగానే అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. రైతులను గాలికొదిలి ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేయడం, అమరావతి గురువుకు సలాం కొడుతూ తిరగడమే రేవంత్‌రెడ్డికి నిత్యకృత్యమైందని మండిపడ్డారు.