ఆర్మూర్ టౌన్/ డిచ్పల్లి, మే 1 : నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని అన్నారు. కేసీఆర్ పాలన బాగుండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడుతున్నామని ప్రజలు ఆయనకు వివరించారు. ఆరు గ్యారెంటీలు అని హడావిడి చేసి, ఇప్పుడు వాటి అమలుపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
డిచ్పల్లి మండలంలోని మిట్టాపల్లిలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుప్పాల గీత బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని వివరించారు. బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు.
జక్రాన్‌పల్లి మండలంలోని గన్యాతండాలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. నాయకుడు కుంచాల రాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతం మహేశ్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.