ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 27: అక్రమ అరెస్టులను ఆపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద ఆదివారం తలెత్తిన ఉద్రిక్త పరిస్థతి నేపథ్యంలో ఆయనను కలవడానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వెళ్తున్న జాజాలను పోలీసులు ఆరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతమందిని అక్రమంగా అరెస్టు చేయిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే నిరంకుశత్వంతో వ్యవహరిస్తే నూకలు చెల్లే కాలం త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.