టెహ్రాన్: తమ అణు కార్యక్రమంపై రాజీకి ఇరాన్ తలుపులు తెరిచింది. తమపై ఆంక్షలు ఎత్తివేస్తే అమెరికాతో ఈ విషయమై రాజీ కుదుర్చుకొనేందుకు సిద్ధమని ప్రతిపాదించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకొన్న వేళ ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మజిద్ తఖ్త్-రవంచి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒప్పందం చేసుకొనే విషయంలో అమెరికానే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య మలి విడత చర్చలు ఈ నెల 17న జెనీవాలో ప్రారంభం కానున్నాయి. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే దిశగా కదులుతున్నదన్న ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తూ వస్తున్నది.