న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: అమెరికాతో మోదీ సర్కారు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులకు శరాఘాతంలా మారింది. ఒప్పందం ఇంకా అమల్లోకి రాకముందే దాని ప్రభావం రైతులపై పడుతున్నది. పత్తి, సోయాబీన్ ధరలు భారీగా పతనం కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు పంటలను నాగ్‌పూర్ ప్రాంతంలో భారీగా పండిస్తారు. ధరల భారీ పతనానికి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందమే కారణమని వ్యాపార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పత్తి పంట కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్‌కు రూ.8,100 ఉండగా, దేశీయ ఓపెన్ మార్కెట్లో రూ.7,200 నుంచి రూ. 6,700 పలికింది. అలాగే సోయాబీన్ ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ. 5,300 ఉండగా, ఓపెన్ మార్కెట్లో 5,000కు పడిపోయింది. ఒక దశలో ఇది రూ.4,200కు దిగజారి తర్వాత కోలుకుంది. దీనిపై రైతు సంఘం శెత్కారీ సంఘటన తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. గతంలో మోదీ ప్రభుత్వం మూడు రైతు నల్ల చట్టాలు తెచ్చినప్పుడు ఈ సంఘం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది.
అయితే శనివారం ఆ సంఘం అధ్యక్షుడు అనియ్ ఘనావత్ మాట్లాడుతూ మక్కజొన్న, బియ్యం నుంచి తయారైన డీడీజీఎస్ వల్ల సోయాబీన్ ధరలపై ప్రభావం పడిందని అన్నారు. పత్తి, మక్కజొన్న నుంచి తయారయ్యే డీడీజీఎస్ (ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే, ఎండబెట్టే ధాన్య అవశేషం) సోయాబీన్‌కు పోటీదారుగా ఉద్భవించిందని అన్నారు. ఈ రెండింటినీ పశువుల దాణాగా ఉపయోగిస్తారు. ఒక వేళ డీడీజీఎప్ను కనుక అమెరికా నుంచి ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటే అది కేవలం సోయాబీన్పైనే కాదు, మక్కజొన్నపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.
వాణిజ్య ఒప్పందం ప్రభావం ఇప్పటికే సోయాబీన్, కాటన్ దేశీయ మార్కెట్లపై పడిందని ప్రముఖ హక్కుల కార్యకర్త విజయ్ జవాన్దియా తెలిపారు. వీటి ధరలు ఇప్పటికే ఎంఎస్పీ కన్నా తక్కువకు దిగజారాయన్నారు. పత్తిని కొనుగోలు చేసి జిన్నింగ్ మిల్లులకు ఇచ్చే వారు ఇప్పటికే ధరలు తగ్గించారని, వారు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కారణంగా చూపుతున్నారని అన్నారు. దీంతో కొందరు రైతులు నేరుగా తమ పత్తిని జిన్నింగ్ మిల్లులకు అమ్ముతూ కొద్దిగా ఎక్కువ మొత్తం పొందుతున్నారని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జిన్నింగ్ యజమానులు కూడా ఎక్కువ మొత్తం చెల్లించే పరిస్థితి లేదన్నారు. యావత్మల్కు చెందిన రైతు మనీశ్ జాదవ్ మాట్లాడుతూ చాలామంది రైతులు ఇప్పటికే తాము పండించిన సోయాబీన్‌ను అమ్మేశారని, కొద్ది మొత్తంలో పత్తి మాత్రం మిగిలి ఉందన్నారు. ఇప్పుడైతే తమకు నష్టాలు తప్పవని, అయితే ఈ ధరల పతనం చూస్తే భవిష్యత్ తలచుకుంటే భయమేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఎంఎస్పీకి తమ పంటలు కొంటుందన్న గ్యారంటీ కూడా భవిష్యత్తులో ఉండకపోవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం భారత్‌కు ఎంతో మేలు చేస్తున్నదని కేంద్రం చేస్తున్న ప్రకటనల పట్ల ప్రముఖ రైతు సంఘం రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ (ఆర్కేఎం) తీవ్రంగా మండిపడింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి ఈ ఒప్పందం తలుపులు బార్లా తెరిచిందని, అలాంటప్పుడు ఇది బంగ్లాదేశ్, పాకిస్థాన్లతో కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఎలా మెరుగైనది అవుతుందని ప్రశ్నించింది.
ఒక పక్క ఈ ఒప్పందం కారణంగా తమ దేశ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని, వాణిజ్య లోటు కూడా తొలగిపోతుందని అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ ఆనందంతో ప్రకటనలు చేస్తుండగా, దానికి విరుద్ధంగా మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ, అది రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అంటూ పొరుగు దేశాలతో పోల్చి చూపిస్తూ మంత్రి గోయల్ చేసిన ప్రకటన మోసపూరితమైనదని, అది ప్రభుత్వ జవాబుదారీతనంపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నదని ఆర్కేఎం జాతీయ కన్వీనర్ కేవీ బిజు పేర్కొన్నారు.
ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ తరపున హాజరైన ప్రతినిధులు ఒప్పందం పూర్తి వివరాలను బయటపెట్టలేదని, అది కనుక వెల్లడిస్త్తే రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగి, తమను పూర్తి చిక్కుల్లోకి నెట్టేస్తుందన్న విషయం వారికి తెలుసని, అందుకే ఆ ఒప్పందం వివరాలను ఇంకా రహస్యంగానే ఉంచారని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నేత ఆరోపించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఉత్పత్తులపై 19 శాతం సుంకాలు విధిస్తున్నందున ఆ దేశాల కన్నా భారత్‌కు ప్రయోజనాలు చేకూరుతాయన్న కేంద్రం వాదనను ఖండించారు.
అమెరికా ఇప్పటికే వస్ర్తాలు సహా పలు వస్తువులను సున్నా సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి బంగ్లాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. దీనిని బట్టి 18 శాతం సుంకాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప విజయమంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. అసలు ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాక ముందు అమెరికా మన ఉత్పత్తులపై సగటున 2-3 శాతం సుంకాలు మాత్రమే విధించేదని, మోదీ ఆ విష యాన్ని దాచి 18 శాతానికి సుంకాలు తగ్గించినట్టు గొప్పలు చెబుతున్నారన్నారు.
స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్‌లు ఈ వాణిజ్య ఒప్పందాన్ని, జీఎం ఉత్పత్తులను వ్యతిరేకిస్తున్నాయని ఆర్కేఎం తెలిపింది. డబ్ల్యూటీవో వద్ద భారత దేశం చాలాకాలంగా అమెరికా వ్యవసాయ సబ్సిడీలను వ్యతిరేకిస్తూ వచ్చిందని, ఇప్పుడు అమెరికా నుంచి సబ్సిడీ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం ఈ సబ్సిడీలను వ్యతిరేకించడంలో భారత దేశంతో నిలిచిన ఇతర దేశాలకు ‘ద్రోహం’ చేయడమేనని విమర్శించింది.
‘ప్రాసెస్ చేసిన ఉత్పత్తి దిగుమతి చేసినప్పుడు జన్యు మార్పిడి (జీఎం) ప్రభావం దీర్ఘకాలం ఉండదు’ అంటూ గోయల్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ జన్యు మార్పిడి ఉత్పత్తులను భారత్‌ను ముంచెత్తడానికి మంత్రి చట్టబద్ధంగా అనుమతి ఇచ్చే ప్రయత్నమే ఈ ప్రకటన అని అన్నారు. సోయాబీన్ ఆయిల్, ఎండిన డిస్టిలర్ల ధాన్యాలు పెద్దమొత్తంలో జీఎం పంటల నుంచే వస్తాయన్నారు. వాటి దిగుమతిని అనుమతించడం అంటే జవాబుదారీతనం లేకుండా జీఎం వ్యవసాయానికి తలుపులు బార్లా తెరవడమేనని ఆయన విమర్శించారు.
మనకన్నా 30 శాతం తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి, సున్నా దిగుమతి సుంకాలతో మన దేశానికి తమ ఉత్పత్తులను సరఫరా చేసేవారితో మన దేశ రైతులు ఎలా పోటీ పడతారో మన వాణిజ్య మంత్రి సమాధానం చెప్పాలని కేవీ బిజు డిమాండ్ చేశారు. ‘అత్యంత అనుకూల దేశం హోదా భారత్‌కు లభించ లేదు. దిగుమతి సుంకాలను 10 శాతానికి తగ్గించ లేదు. అంతేకాకుండా ఈ ఒప్పందానికి ముందు ఉన్న 5-15 శాతం సుంకాలను కూడా పునరుద్ధరించ లేదు. ఈ ప్రాథమిక ప్రతికూలతలను పరిష్కరించకుండా పోటీతత్వాన్ని పొందుతామన్న వాదనలు బోలుగా ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.