ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 9: ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దండుపాళ్యం ముఠా వచ్చినట్లేనని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ ఎన్నికలు ఎల్లారెడ్డి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిని కాపాడుకోవడానికి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీచౌక్ వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థులకు చెబుతున్నారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పారని, దీంతో కాంగ్రెస్ నాయకులు ఆరు నెలల మంత్రిని ఇక్కడికి తీసుకువచ్చారని తెలిపారు. సదరు మంత్రి చేసింది, చెప్పింది ఏమీలేదని విమర్శించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్న వ్యాపారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులను స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
ఎల్లారెడ్డి నుంచి లింగారెడ్డి పేటకు రోడ్డు నిర్మాణం కోసం రూ. 2 కోట్ల నిధులు గతంలోనే మంజూరయ్యాయని, రెండేండ్లుగా పనులు ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని ప్రజలు తనకు చెప్పారని తెలిపారు. రోడ్ల నిర్మాణం కోసం మట్టిని వాడుతున్నారని మండిపడ్డారు. తాను ఉన్నప్పుడే ప్రతి వీధిలో సీసీ రోడ్లు వేశామని తెలిపారు. తాను రూ. 2 కోట్లతో రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడితే, వాటిలో కాలిపోయిన లైట్లు మార్చి దానికి ప్రారంభోత్సవం చేసిన ఘనత స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకే దక్కిందని ఎద్దేవా చేశారు.
గత మున్సిపల్ పాలక వర్గం ఇంటి నిర్మాణం కోసం కనీసం ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని,ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే అవినీతి తారా స్థాయికి చేరుకుంటుందని జాజాల అన్నా రు. ఎల్లారెడ్డి పట్టణాన్ని దండుపాళ్యం ము ఠా నుంచి కాపాడుకునేందుకు కచ్చితంగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మె ల్యే జనార్దన్‌గౌడ్, జలేంధర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సతీశ్, రవి, సాయిబాబా, ఏగుల నర్సింహులు, సాయిలు, నాయకులు పాల్గొన్నారు.