ఎల్లారెడ్డి, ఆగస్టు 22: ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించి ప్రస్తుతం కొందరికే మాఫీ చేస్తూ రేవంత్ సర్కారు మోసం చేసిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నిర్వహించిన రైతుధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఏ గ్రామంలోనూ రుణమాఫీ సక్రమంగా కాలేదన్నారు. రుణమాఫీ చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు హైదరాబాద్లో హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడంలో విఫలమయ్యారన్నారు. చేసిన మోసాలను కప్పి పుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్.. రైతుల పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల పక్షాన నిలబడి రుణమాఫీ పూర్తయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎల్లారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.