ఎల్లారెడ్డి రూరల్, జనవరి 25: కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వారికి ఓట్లు వేసి మళ్లీ మోసపోవద్దని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరారు. ఆదివారం ఆయన పట్టణంలోని 6వ వార్డులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు.
కాంగ్రెస్ నాయకులు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే బాకీ కార్డును చూపించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత ఓట్లు అడగాలంటూ చెప్పాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు చేతలకు ఎంతో వ్యత్యాసం ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వార్టులో పర్యటించిన జాజాలకు స్థానికులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జలంధర్‌రెడ్డి, ఆదిమూలం సతీశ్‌కుమార్, సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింహులు, నాయకులు బబ్లూ, నాగం సురేందర్ తదితరులున్నారు.