ఎల్లారెడ్డి, జూన్ 18: రాష్ర్టాన్ని పాలిస్తున్న రేవంత్‌రెడ్డి, దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ ఇద్దరూ రైతులను మోసం చేస్తున్నారని, చోటా బాయ్…బడా బాయ్..ఇద్దరూ తోడు దొంగలేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిలోని తహసీల్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రైతులతో కలిసి జాజాల ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా కోసం తీసుకువచ్చిన యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు వందశాతం వ్యవసాయం మీద ఆధారపడిన వారని, వారికి యాప్ కారణంగా యూరియా దొరక్క వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలోని 75 వేల మంది రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని, వారి కష్టాలు తీర్చకపోతే పాలన యంత్రాంగాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతు భరోసా పథకాలు అమలుచేసి, అన్ని రకాల పంటలను కొనుగోలు చేసి రైతును రాజుగా చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమా కోసం బీమా సంస్థకు డబ్బులు కట్టక పోవడంతో ఆ పథకం అమలు నిలిచిపోయిందని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ దూరమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటే ఇప్పుడు 8 గంటలు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు.రైతులు పంట పండించడానికి మూడు నెలల సమయం తీసుకుంటే, వాటిని అమ్ముకోవడానికీ మూడు నెలలు పడుతుందన్నారు.
వడ్లు క్వింటాలుకు పది కిలోల తరుగు తీస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కనీసం ఒక్క రోజైనా రైస్‌మిల్లులను సందర్శించారా? రైతుల బాధలు తెలుసుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజధానిలో భూములు అమ్ముకోవడం, డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే తెలుసని విమర్శించారు.
ధర్నా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలే
ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యే ఫొటో పెట్టాలని చెప్పడంపై లబ్ధిదారులు విమర్శలు చేస్తున్నారని, 20 లక్షల ఇండ్లలో ప్రభుత్వం ఇచ్చింది కేవలం 5 లక్షలే అంటూ వారు తిడుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోన్‌చేసి ‘అన్నా! కొంచెం ధర్నా చేయండి..’అంటూ బతిమిలాడుతున్నారని చెప్పారు. ఆ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం పని తీరుపై నమ్మకం పోయిందని, రైతులు, ప్రజలు పూర్తిగా విసిగి పోయారని పేర్కొన్నారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ఏడీఏ సుధా మాధురి, వ్యవసాయ శాఖ అధికారి శోభ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అక్కడికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే జాజాలతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూమి ఎంత, ఇప్పటి వరకు ఎంత యూరియా సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు. రైతులకు అవసరమైనంత యూరియా పంపిణీ చేయాలని, యూప్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వానికి నివేదించాలని వారికి జాజాల సూచించారు. అనంతరం రాస్తారోకో విరమించారు.