బిచ్కుంద, నవంబర్ 28: అవినీతిపరుడైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుపై నిరంతర పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టంచేశారు. ఎక్కడా రాజీ పడేదే లేదని తేల్చిచెప్పారు. బిచ్కుందలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష్మీకాంతారావు ఎస్సీ కాదు, బీసీ అని తాను కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. అయితే, కేసు విషయంలో తాను ఎమ్మెల్యేతో కాంప్రమైజ్ అయ్యానని ఒక పత్రికలో, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎక్కడా తగ్గేది లేదని, గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ అవినీతిపరుడైన లక్ష్మీకాంతారావుతో కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన రికార్డుల్లో లక్ష్మీకాంతారావు బీసీ అని ఉందని, దీనిపైనే తాను పిటిషన్ వేశానని తెలిపారు. అధికారులను మభ్యపెట్టి ఎస్సీ సర్టిఫికెట్ పొందాడని, తమకు న్యాయస్థానం, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదని, ఎమ్మెల్యే వ్యవహారాన్ని న్యాయస్థానమే తేల్చుతుందన్నారు.
తాను 15 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదన్నారు. కానీ ఎమ్మెల్యే అయి ఏడాది కూడా పూర్తి కాకముందే లక్ష్మీకాంతారావుపై సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారని తెలిపారు. డబ్బులు తీసుకుని మార్కెట్ కమిటీ పదవులు ఇస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్లో ధర్నా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా షిండే గుర్తు చేశారు. లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే కావడం ఈ ప్రాంతానికి ఎంత నష్టమో ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు తెలిసి వచ్చిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, నేతలు బాలాజీ, హన్మాండ్లు, సంజు పటేల్ పాల్గొన్నారు.