డిచ్పల్లి, నవంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో టైం పాస్ కోసమే సర్వే చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సర్వేలో భాగంగా సోమవారం తన ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆయన వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గురించి రేవంత్‌రెడ్డి అప్పట్లో మాట్లాడిన వీడియోను బాజిరెడ్డి.. ఎన్యుమరేటర్లకు చూపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేసిన సమగ్ర సర్వేను ఎద్దేవా చేసిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన ఎందుకు సర్వే చేస్తున్నాడో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత మాటలతో, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, 11 నెలలైనా పథకాలను అమలు చేయకపోవడం సిగ్గుచేట్టన్నారు. అధికారంలో లేనప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు రైతులకిచ్చిన రైతుభరోసా నెరవేరేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు. ప్రజలకు ఉపయోగపడే సమగ్రమైన సర్వే దీంట్లో లేదని, మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షించుకోవాలన్నారు.