ఆర్మూర్‌టౌన్, ఆగస్టు 22 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ సిద్ధుల గుట్ట సాక్షిగా రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జీవన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో ఆరు గ్యారెంటీలు ఆకాశాన్నంటాయన్నారు. అసత్యపు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. రైతులకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. ఆర్మూర్ అంటే రైతు ఉద్యమాలగడ్డ్డ అని, గతంలో పసుపు బోర్డు సాధన కోసం, ఎర్రజొన్నల మద్దతు ధర కోసం ఉద్యమించిన చరిత్ర ఆర్మూర్ గడ్డకు ఉన్నదని గుర్తుచేశారు.
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల ఒత్తిళ్లు ఎక్కువైయ్యాయని, ప్రతి అంశాన్ని బుక్‌లో రాస్తుమన్నామని హెచ్చరించారు. ఈ నెల 24న రైతులంతా చేపట్టబోయే మహాధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోయేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, కౌన్సిలర్ గంగామోహన్ చక్రు, పోల సుధాకర్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.