మోర్తాడ్, సెప్టెంబర్ 26: ఆరోగ్యమైన సమాజం కేవలం క్రీడలతోనే సాధ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడం అలవడుతుందని, తద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటోపోట్లను తట్టుకునే శక్తి లభిస్తుందని చెప్పారు. కమ్మర్పల్లి మినీ స్టేడియంలో ఎస్జీఎఫ్ మండల అంతర పాఠశాలల క్రీడలను వేముల గురువారం ప్రారంభించారు.
విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాపోటీల నిర్వహణను సామాజిక బాధ్యతగా చూడాలని చెప్పారు. క్రీడల నిర్వహణ దైవకార్యం లాంటిదని, ఇందుకు డబ్బు, ఇతర రూపకంగా సహకారం అందించాలని ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో ఆటలను మరచిపోయే పరిస్థితులు ఏర్పడవద్దనే ఆలోచనతో ప్రతిఒక్కరూ క్రీడలకు సహకరించాలని కోరారు. క్రీడలు కెరీర్ డెవలప్మెంట్కు కూడా ఉపయోగపడుతాయని, క్రీడాకారులు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని వివరించారు. స్పోర్ట్స్‌కు పెట్టింది పేరు కమ్మర్పల్లి అని, గతంలో ఎక్కడ నిర్వహించనన్ని టోర్నీలు కమ్మర్‌పల్లిలో నిర్వహించే వారని అదే విధానాన్ని కొనసాగించాలన్నారు.
తాను మంత్రిగా ఉన్నపుడు కమ్మర్‌పల్లిలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ.2.60 కోట్లు మంజూరు చేయించానని, ఇప్పుడు అదే స్టేడియంలో పోటీలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తన వియ్యంకుడు, వ్యాపారవేత్త దయానందరెడ్డి దాతృత్వానికి అవధులు లేవని, అనేక పాఠశాలలకు డెస్క్‌బెంచీలు, కంప్యూటర్లు, స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇస్తున్నారని తెలిపారు. అనంతరం మార్చ్ఫాస్ట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్, క్రీడల కన్వీనర్ సాయన్న, ఎంఈవో ఆంధ్రయ్య, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.