భీమ్గల్, ఫిబ్రవరి 7: భీమ్గల్కు తాను ఏమీ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ నోటితో పక్కనున్న నాయకులు అబద్ధాలు పలికించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ ఫంక్షన్ హాల్లో కూర్చునే బదులు పట్టణంలో తిరిగి చూస్తే తాను చేసిన అభివృద్ధి కండ్లకు కనిపించేదని స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని 3,5,6వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.రెండు వందల కోట్లతో పట్టణాన్ని సర్వాంగ సుందరగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయడంతోనే భీమ్గల్ మార్కెట్ విలువ పెరిగిందని తెలిపారు.
గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కల్యాణ లక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం అడిగినందుకు లాఠీలతో ఉరికించి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదన్నారు. పైగా 32 మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అధికార గర్వంతో దౌర్జన్యాలకు దిగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓటుతో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, అన్వేశ్రెడ్డి ప్రభుత్వ కార్లు, పోలీసు జీపులు వేసుకుని తనపై దండయాత్రకు వస్తున్నారని, తాను నిజాలు చెబుతుంటే అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
వీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం తాను వాస్తవాలు వెల్లడిస్తూనే ఉంటానన్నారు. వీరి దౌర్జన్యాలను ప్రజలు గమనించాలన్నారు. బీజేపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి అధిక పన్నులు వెళ్తున్నా.. కేంద్రం మాత్రం నిధులు కేటాయించడంలేదన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు బొదిరె లావణ్య, నీలం లావణ్య, మూత లింబాద్రి, నాయకులు పాల్గొన్నారు.