భీమ్‌గల్, ఫిబ్రవరి 8: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు విని మోసపోయామని, మళ్లీ ఆ తప్పు చేయొద్దని సూచించారు. ఆదివారం రాత్రి ఆయన భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో మైనార్టీ మహిళల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ మోస పూరిత మాటలు విని ఒక్క తప్పుకు ఐదేండ్లు శిక్ష అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రాష్ట్రంలో మైనార్టీలకు గౌరవం దక్కిందని, అది కేసీఆర్‌తోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మైనార్టీల పిల్లల కోసం 240 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గతంలో వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదన్నారు. కేవలం తెలంగాణ వచ్చాకనే కరెంటు, నీళ్ల కష్టాలు తీరాయన్నారు. షాదీ ముబారక్ పథకం తెచ్చి మైనార్టీ మహిళల సంక్షేమం గురించి ఆలోచన చేసిందే కేసీఆర్ అన్నారు. నిరంతరం మైనార్టీ సంక్షేమం ఆలోచించే పెద్ద మనసు ఉన్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. గతంలో హైదరాబాద్, నిజామాబాద్‌లో ఎప్పుడూ అల్లర్లు, మత కల్లోలాలు జరిగేవని, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటికి తెలియకుండా మైనార్టీల మీద ఎన్నో కేసులు పెడుతున్నారన్నారు.
గతంలో 40-50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్ అన్నారు. సరైన అభ్యర్థులను ఎన్నుకోకపోతే నష్టపోతామన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంలో ఎవరు చేయని అభివృద్ధి బాల్కొండలో చేశాడని తెలిపారు. అలాంటి నాయకుడిని విడిచిపెట్టవద్దని సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గడ్డం సుమనా రెడ్డి, మైనార్టీ నాయకులు మొయిజ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.