IPS Trainee | హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
2 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. హైదరాబాద్లోని రెండు అడ్రస్ల్లోనూ ఉదయ్ కృష్ణారెడ్డి కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరారిలో ఉన్నాడని, ఫోన్ కూడా స్విచాప్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించాడు.
తాను ఎక్కడికీ పారిపోలేదని క్లారిటీ ఇచ్చాడు ఉదయ్ కృష్ణారెడ్డి . మా నానమ్మ అనారోగ్యంతో ఉన్నందుకు సొంతూరు ఊళ్లపాలెం వచ్చాను. న్యాయ, పోలీసు వ్యవస్థల మీద నమ్మకంతోనే విచారణకు హాజరవుతున్నా. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా. నా శాశ్వత చిరునామా ఊళ్లపాలెంకు ఎటువంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేనని పేర్కొన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి.